weather: ఈసారి భానుడు చండప్రచండుడే.. తెలంగాణలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల పైమాటే!

  • హైదరాబాద్‌ వాతావరణ శాఖ అంచనా ఇది
  • అప్పుడే మొదలైన వేసవి తాపం
  • వడగాల్పులకు అవకాశం

ఈసారి భానుడు భగభగమంటాడని, చండప్రచండుడై ప్రతాపం చూపుతాడని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫిబ్రవరిలోనే ప్రారంభమైన వేసవి తాపం ఇందుకు శాంపిల్‌ మాత్రమేనని చెబుతోంది. ఈ వేసవిలో తెలంగాణ రాష్ట్రంలో చాలాచోట్ల 46 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, హైదరాబాద్‌లో గరిష్టంగా 44 డిగ్రీలు ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఏప్రిల్‌, మే నెలల్లో క్యుములోనింబస్‌ మేఘాల వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది. రెండేళ్ల క్రితం ఎదురైన పరిస్థితుల కంటే ఇబ్బందికర పరిస్థితులే ఈసారి చవిచూడాల్సి రావచ్చని, వడగాల్పుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరగడం, తగ్గడం గాలిలో తేమ, దిశపై ఆధారపడి ఉంటాయన్నారు.

 ఫిబ్రవరిలో సాధారణం కంటే మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి గాలిలో తేమ శాతం తగ్గడమే కారణమని చెప్పారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణులు ఏర్పడడం కూడా పరిస్థితిని ప్రభావితం చేసిందని తెలిపారు. ఉత్తరాది, వాయవ్య దిశ నుంచి రాష్ట్రంలోకి వీచే గాలుల్లో తేమ శాతం తక్కువని, వాటి ప్రభావం ఉంటే ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్నారు. అదే బంగాళాఖాతం, అరేబియా మహా సముద్రం వైపు దక్షిణం, ఆగ్నేయం వైపు నుంచి గాలులు రాష్ట్రంలోకి వీస్తున్నాయంటే ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, ఇందుకు కారణం ఈ గాలుల్లో తేమ శాతం అధికంగా ఉండడమేనని చెప్పారు.

2016లో తెలంగాణ రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 27 రోజులు వడగాల్పులు వీచాయి. 2017లోనూ 23 రోజులు వడగాల్పులు వీచాయి. ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వేసవి హడలెత్తించింది. 2018లో పరిస్థితి కొంత ఉపశమనంగానే ఉంది. కానీ ఈసారి మాత్రం రెండేళ్ల క్రితం నాటి పరిస్థితులే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

weather
Hyderabad
high winds
high temparature
  • Loading...

More Telugu News