Pakistan: భారత పైలట్ అనుకుని తమ పైలట్‌నే చావబాదిన పాకిస్థానీలు
- పాక్ భూభాగంలో పడిన అభినందన్, పాక్ పైలట్
- పాక్ పైలట్‌ను భారత పైలట్‌గా భ్రమపడిన ప్రజలు
- చితకబాదడంతో అపస్మారక స్థితిలోకి..
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేయడంతో ఉడికిపోతున్న పాకిస్థానీలు.. భారత పైలట్ అనుకుని సొంత పైలట్‌నే చితకబాదారు. ఇంతకీ ఏం జరిగిందంటే?.. భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ యుద్ధ విమానాలను తరుముకుంటూ వెళ్లిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ పాక్ యుద్ధ విమానం ఎఫ్-16ను కూల్చివేశాడు.
పాక్ జరిపిన దాడిలో అభినందన్ మిగ్ విమానం కూలిపోయింది. దీంతో ఆయన పారాచూట్ సాయంతో సురక్షితంగా కిందికి దిగాడు. అలాగే, కూలిన ఎఫ్-16 విమానం నుంచి పాక్ పైలట్ కూడా కిందికి దిగాడు. పాక్ భూభాగంలో అడుగుపెట్టిన అభినందన్‌ను బందీగా పట్టుకున్న పాక్ ప్రజలు.. మరోవైపు తమ పైలట్ విషయంలోనూ పొరపాటు పడ్డారు. తమ పైలట్‌ను భారత పైలట్‌గా భావించి చితకబాదారు.
ఆయనపై రెచ్చిపోయి దాడిచేయడంతో పాక్ పైలట్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పైలట్‌ను రక్షించి ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం సైన్యానికి సమాచారం అందించారు. తొలుత అతడు భారత్ పైలట్ అని భ్రమపడిన సైన్యం కూడా ఇద్దరు భారత పైలట్లను పట్టుకున్నట్టు ప్రకటించింది. అనంతరం అసలు విషయం తెలిసి నాలుక్కరుచుకుని ఒక్క భారత పైలట్ మాత్రమే తమ అధీనంలో ఉన్నట్టు ప్రకటించింది.