India: అభినందన్ కు స్వాగతం పలుకుతాను... అవకాశం ఇవ్వండి: మోదీని కోరిన పంజాబ్ సీఎం
- వాఘా బోర్డర్ వద్ద ఘనస్వాగతం పలికేందుకు అమరీందర్ సంసిద్ధత
- తాను కూడా సైనికుడ్నేనంటూ ఉద్ఘాటన
- ప్రధాని మోదీకి ట్వీట్
భారత వాయుసేన పైలెట్ అభినందన్ వర్ధమాన్ శుక్రవారం పాకిస్థాన్ నుంచి భారత్ రానున్నాడు. పీఓకేలో ఐఏఎఫ్ విమానం కూలిపోవడంతో పైలెట్ అభినందన్ పాక్ సైన్యానికి బందీ అయ్యాడు. అయితే అంతర్జాతీయంగా ఒత్తిళ్లు తీవ్రం కావడంతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత వింగ్ కమాండర్ ను విడుదల చేసేందుకు మొగ్గుచూపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.
ఈ క్రమంలో, వాఘా సరిహద్దు వద్ద అభినందన్ కు తాను స్వాగతం పలుకుతానంటూ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. తనకు అవకాశం కల్పించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ప్రస్తుతం తాను అమృత్ సర్ లో ఉన్నానని, భారత్-పాక్ సరిహద్దు ప్రాంతానికి దగ్గర్లోనే ఉన్నానని తెలిపారు.
పాకిస్థాన్ ప్రభుత్వం అభినందన్ ను విడుదల చేయనున్నట్టు తెలిసిందని, అతడికి వాఘా బోర్డర్ వద్ద స్వాగతం పలికే అవకాశం తనకు ఇవ్వాలని అభ్యర్థించారు. అభినందన్ లాంటి ధైర్యశాలికి తిరిగి దేశంలోకి స్వాగతం పలకడం తనకు లభించే గొప్ప గౌరవంగా భావిస్తానని ట్వీట్ చేశారు కెప్టెన్ అమరీందర్ సింగ్. అభినందన్, అతని తండ్రి ఎలా దేశ రక్షణలో పాలుపంచుకున్నారో తాను కూడా అలాగే ఓ కెప్టెన్ గా సేవలు అందించానని రక్షణ రంగంతో తన అనుబంధాన్ని మోదీకి గుర్తు చేశారు.