India: మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తే ఏం జరుగుతుంది?
- నిధులు అందడం కష్టమే
- ప్రయాణాలపై నిషేధం.. ఏ దేశం అడుగుపెట్టనివ్వదు
- ఉక్కిరిబిక్కిరి చేసే ఆంక్షలు... ఆయుధాల కొనుగోలుకు చెక్
పాకిస్థాన్ లో తిష్టవేసుక్కూర్చున్న ఉగ్రవాద నాయకులపై అంతర్జాతీయ నిషేధం విధించాలంటూ భారత్ ఎప్పట్నించో డిమాండ్ చేస్తోంది. దేశ భద్రతకు అత్యంత ప్రమాదకరంగా మారుతున్న ఉగ్రవాద సంస్థల చీఫ్ లను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఒక్కసారి అంతర్జాతీయ ఉగ్రవాది అన్న ముద్ర వేసిందంటే చాలు... వాళ్లు రెక్కలు తెగిన పక్షుల్లా గిలగిల్లాడిపోవాల్సిందే!
వాళ్లు ఏ దేశానికి ప్రయాణించే వీలుండదు. ఆర్థిక కార్యకలాపాలు నిర్వర్తించడం సాధ్యం కాదు. ఆయుధాల అమ్మకానికి ఎవరూ ముందుకు రారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు ఉగ్రవాద సంస్థను కాదు కదా మరే సంస్థను నడపాలన్నా శక్తికి మించిన పనవుతుంది. ఇప్పుడు జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ను కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయాలంటూ భారత్ చేస్తున్న పోరాటానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతు పలికాయి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి తాజా ప్రతిపాదన చేశాయి. దీనిపై భద్రతామండలి మరికొన్ని రోజుల్లోనే నిర్ణయం వెలిబుచ్చే అవకాశాలున్నాయి
భద్రతామండలి అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేస్తే జరిగే పరిణామాలు
- ఓ వ్యక్తి పైన గానీ ఓ సంస్థ పైన గానీ భద్రతామండలి నిషేధం ముద్రవేస్తే వారి ఆస్తులన్నీ స్తంభింపజేస్తారు.
- ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయడం సాధ్యం కాదు.
- వాళ్లకు ఇతరులు ఎవరైనా ఆర్థిక సాయం చేయడం అంతకన్నా వీలుపడదు.
- తమ భూభాగంలోకి ఏ దేశం కూడా అనుమతించదు.
- ఆయుధాలు కొనుగోలు, విక్రయం గురించి ఆశలు వదులుకోవాల్సిందే.
- వాహనాలు, ఆయుధాలు, వాటి విడిభాగాలు, ఆయా దేశాల పతాకం ముద్రించి ఉండే ఆయుధ సంబంధిత అన్నిరకాల వస్తువులు అందని ద్రాక్షలవుతాయి.
- ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాద సంస్థలను నడపడం ఏమంత సులువుకాదు.
- ముఖ్యంగా ఆర్థిక మూలాలు దెబ్బతింటాయి గనుక ఏ ఉగ్రవాద సంస్థయినా కొద్దికాలంలోనే నిర్వీర్యం అవుతుంది.