India: పాక్ భూభాగంపై ఇస్రో డేగకన్ను!

  • 87 శాతం భూభాగంపై భారత ఉపగ్రహాల పహారా
  • హై రిజల్యూషన్ తో చిత్రాలు
  • కీలక దాడులకు డేటా సరఫరా

తగినన్ని ఆర్థిక వనరులు లేకపోయినా దేశభక్తి మెండుగా ఉన్న శాస్త్రవేత్తలే కొండంత అండగా సేవలు అందిస్తున్న సంస్థ ఇస్రో. అంతరిక్ష పరిశోధనలు, సమాచార సేవలు మాత్రమే కాకుండా రక్షణ రంగానికి సైతం అపారమైన సాయం అందిస్తున్న ఇస్రో ఇటీవలి బాలాకోట్ దాడుల్లోనూ కీలకపాత్ర పోషించింది.

భారత సైన్యం నిర్వహించే అనేక ఆపరేషన్లలో ఇస్రోది కీలకపాత్ర. భారత్ ఆర్మీ రూపొందించే ప్రణాళికల్లో ఇస్రో అందించే ఛాయాచిత్రాలే ముఖ్యభూమిక పోషిస్తున్నాయి. రోదసిలో నిత్యం సంచరించే భారత ఉపగ్రహాలు భూమిపై ప్రతి చిన్న అంశాన్ని కూడా రికార్డు చేయగల సామర్థ్యం ఉన్నవి కావడంతో ఇస్రో అందించే సమాచారం భారత ఆర్మీకి ఎంతో ఉపయోగపడుతోంది. ముఖ్యంగా, దాయాది పాకిస్థాన్ పనిబట్టే విషయంలో ఇస్రోనే భారత సైన్యానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది.

ఎలాగంటే... ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్న ఇస్రో ఉపగ్రహాలు దాదాపు పాకిస్థాన్ భూభాగం మొత్తంపైనే ఓ కన్నేసి ఉంచగలవు. దానిలో 87 శాతం పాక్ భూభాగాన్ని అత్యంత స్పష్టంగా చిత్రీకరించగల సత్తా మన శాటిలైట్లకు ఉంది. అంటే, పాక్ భూభాగం మొత్తం 8.8 లక్షల చదరపు కిలోమీటర్లు అయితే, అందులో 7.7 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగంపై ఇస్రో శాటిలైట్లు హైరిజల్యూషన్ చిత్రాలు అందించగలవు. ఈ కారణంగా ఉగ్రవాదుల కదలికలపై భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఓ అంచనాకు రాగలుగుతోంది. మొన్నటి పుల్వామా దాడి తర్వాత ఎక్కడెక్కడో ఉన్న ఉగ్రవాదులందరూ స్థావరాలను ఖాళీ చేసి బాలాకోట్ స్థావరంలో తలదాచుకున్న విషయం ఇస్రో ఉపగ్రహాలు వెంటనే పసిగట్టాయి. ఇస్రో ప్రయోగించిన కార్టోశాట్ ఉపగ్రహాలకు మాత్రమే ఈ ప్రత్యేక సామర్ధ్యం ఉంది.  

  • Loading...

More Telugu News