Talasani: యాదవ గర్జన సభ పెట్టుకోనివ్వకుండా ఏపీ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు: తలసాని
- గుంటూరులో సభకు ఏర్పాటు చేసుకుంటున్నాం
- దేశంలో ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కుంది
- అనుమతివ్వకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
తెలంగాణలో టీడీపీ సభలు పెట్టినప్పుడు తాము వాటికి అభ్యంతరం చెప్పలేదని.. కానీ తాము తలపెట్టిన యాదవ గర్జన సభకు అనుమతివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆరోపించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 3న గుంటూరు సమీపంలో తాము యాదవ గర్జన సభకు ఏర్పాటు చేసుకుంటున్నామని, కానీ ఏపీ పోలీసులు అనుమతివ్వకుండా నాన్చుతున్నారని విమర్శించారు.
దేశంలో ఎక్కడైనా తమకు సభ పెట్టుకునే హక్కుందని ఆయన తెలిపారు. యాదవ గర్జన సభకు అనుమతివ్వకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని.. లేదంటే రహదారిపైనే సభ నిర్వహిస్తామని తలసాని తెలిపారు. మిగిలిన పార్టీలు, సంఘాలకు కూడా ఏపీ పోలీసులు ఇలాంటి షరతులే పెట్టారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు తనను సనత్‌నగర్‌లో ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నించారని తలసాని ఆరోపించారు.