KCR: అప్పు చేస్తే తప్పేంటని సిగ్గులేకుండా చెబుతున్న ఇలాంటి సీఎంను ఎవరినైనా చూశామా?: కేసీఆర్‌పై పొన్నం ఫైర్
- రాష్ట్ర విభజన నాటికి అప్పు రూ.60 వేల కోట్లు
- టీఆర్ఎస్ ప్రభుత్వం దానిని రూ.2 లక్షల కోట్లు చేసింది
- పుట్టిన ప్రతి బిడ్డపై రూ.లక్ష అప్పు
అప్పు చేస్తే తప్పేంటని నిర్మొహమాటంగా.. సిగ్గులేకుండా చెబుతున్న ఇలాంటి ముఖ్యమంత్రిని ఎవరినైనా చూశామా? అంటూ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ విరుచుకుపడ్డారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఈర్ల కొమరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 60 సంవత్సరాల కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో రాష్ట్ర విభజన జరిగే నాటికి మనకొచ్చిన అప్పు రూ.60 వేల కోట్లన్నారు.
కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిందని దుయ్యబట్టారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డపై లక్ష రూపాయల అప్పు ఉండే విధంగా ప్రభుత్వం వ్యవహారం నడుపుతోందని పొన్నం విమర్శించారు. ముఖ్యమంత్రికి ఆర్థిక క్రమశిక్షణ లేదని మండిపడ్డారు. ఈసారి కూడా మనం కేసీఆర్‌కు అధికారమిచ్చామని.. దానికి బాధపడాల్సిన అవసరం లేదన్నారు. రాబోయే కాలంలో తెలంగాణను కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందనే ధైర్యంతో ముందుకు పోదామన్నారు.