India: విపక్షాల స్టేట్ మెంట్ పాకిస్థాన్ కు ఒక గుడ్ న్యూస్!: జవదేకర్
- మహాకూటమి ప్రకటన ఎవరికి లాభం?
- పాకిస్థాన్ కా? పాక్ ఆర్మీకా? పాక్ మీడియాకా?
- భారత రాజకీయ వ్యవస్థ ఐక్యంగా లేదంటూ పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి
ఢిల్లీలో నిన్న 21 విపక్ష పార్టీలు భేటీ అయిన సంగతి తెలిసిందే. సమావేశానంతరం ఒక సంయుక్త ప్రకటనను విపక్షాలు ఇచ్చాయి. మన జవాన్ల త్యాగాలను అధికార పార్టీ వ్యక్తిగత రాజకీయాల కోసం వాడుకుంటోందని విపక్షాలు విమర్శించాయి. ఈ ప్రకటనపై కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, ప్రకాశ్ జవదేకర్ లు మండిపడ్డారు.
విపక్షాల ప్రకటన పాకిస్థాన్ కు ఒక గుడ్ న్యూస్ వంటిదని జవదేకర్ మండిపడ్డారు. మహాకూటమి నేతల ప్రకటనతో ఎవరికి లాభమని ఆయన ప్రశ్నించారు. పాకిస్థాన్ కా? పాక్ ఆర్మీకా? పాక్ మీడియాకా? అని నిలదీశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటంలో భారత్ లోని రాజకీయ వ్యవస్థ ఐక్యంగా లేదంటూ... వీరి ప్రకటన తర్వాత పాక్ మీడియాలో కథనాలు వచ్చాయని అన్నారు.
దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా వరుసగా ట్వీట్లు చేశారు. 'యావత్ దేశం ఒకే మాటపై నిలబడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా... ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను భారత ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుంటోందని విపక్షాలు ఎందుకు ఆరోపిస్తున్నాయి? జాతి మొత్తం ఒకే గొంతుకను వినిపించాలని విపక్షాలను నేను కోరుతున్నా. మీరు ఇచ్చిన స్టేట్ మెంటు ను పాకిస్థాన్ తనకు అనుకూలంగా మలచుకునే అవకాశం ఉంది' అని ట్వీట్లు చేశారు.