Karnataka: మూఢనమ్మకంతో మూడేళ్ల బిడ్డను పొట్టన పెట్టుకున్న తండ్రి
- ఆరోగ్యం కుదుట పడాలని ఒంటినిండా సిగరెట్‌తో చురకలు
- వాతలు పుండ్లుగా మారి తీవ్ర జ్వరంతో మృతి
- కర్ణాటకలోని కోలారు జిల్లా మాలూరు పట్టణంలో ఘటన
మూఢనమ్మకంతో ఓ తండ్రి విపరీత చేష్టలు అతని మూడేళ్ల కొడుకు ప్రాణాలు పోయేందుకు కారణమయ్యాయి. కొడుకు ఆరోగ్యం కుదుటపడాలంటే ఒంటిపై సిగరెట్‌తో వాతలు పెట్టాలన్న ఓ భూతవైద్యుడి మాటలను నమ్మిన అతను అలాగే చేయడంతో ఆ చిన్నారి చనిపోయాడు. కర్ణాటకలోని కోలారు జిల్లా మాలూరు పట్టణంలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.
బెంగళూరుకు చెందిన హరీష్, రేణుకలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అనంతరం మాలూరులోని మారుతి నగర్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరికి పృథ్వీ అనే మూడేళ్ల కొడుకు ఉన్నాడు. పృథ్వీ అంత చురుకుగా ఉండకపోవడంతో ఇటీవల ఓ భూత వైద్యుని వద్దకు తీసుకువెళ్లారు.
బిడ్డ ఆరోగ్యం కుదుట పడాలంటే ఒంటి నిండా వాతలు పెట్టాలని అతను సూచించాడు. దీంతో వారం రోజుల నుంచి హరీష్ సిగరెట్‌తో కొడుకు వంటినిండా వాతలు పెడుతుండడంతో అవి పుండ్లుగా మారాయి. గుడికి తీసుకు వెళ్దామని మంగళవారం పృథ్వీకి స్నానం చేయించగా ఆ తర్వాత తీవ్రమైన జ్వరం వచ్చింది. వెంటనే బాలుడిని పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. బాలుని తాత నంజుడప్ప మనవడి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హరీష్, రేణుకలను అరెస్టు చేశారు.