Andhra Pradesh: వైసీపీలో చేరనున్న దాడి వీరభద్రరావు.. 10 రోజుల్లో క్లారిటీ ఇస్తానన్న నేత!
- పార్టీలో చేరాలని వైసీపీ నేతలు కోరుతున్నారన్న నేత
- అనకాపల్లిలో మద్దతుదారులతో దాడి భేటీ
- వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్న వీరభద్రరావు
వైసీపీలో చేరాల్సిందిగా ఆ పార్టీ నేతలు తనను కోరుతున్నానని సీనియర్ నేత దాడి వీరభద్రరావు తెలిపారు. ఈ విషయమై అనుచరులు, మద్దతుదారులతో చర్చించి మరో 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. అనకాపల్లిలోని లక్ష్మీనారాయణనగర్ లో అనుచరులతో దాడి వీరభద్రరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీలో చేరాలన్న విషయమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కొందరు మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని దాడికి సూచించారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీ తరఫున పోటీ చేస్తేనే బాగుంటుందని దాడి వీరభద్రరావు అభిప్రాయపడ్డారు. కాగా, తన రాజకీయ ప్రత్యర్థి కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో దాడి వీరభద్రరావు వైసీపీలో చేరే అవకాశాలే మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
2013లో ఎమ్మెల్సీ టికెట్ దక్కనందుకు దాడి టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం కుమారుడితో కలిసి వైసీపీలో చేరారు. అయితే 2014 ఎన్నికల్లో విశాఖ పశ్చిమం నుంచి పోటీ చేసిన దాడి కుమారుడు దాడి రత్నాకర్ పరాజయం పాలయ్యారు. అనంతరం కొద్దికాలానికే దాడి వీరభద్రరావు వైసీపీ సైతం వీడారు.