SCR: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుతో సగం తగ్గనున్న ద.మ.రై ఆదాయం!
- ఆరు డివిజన్లలో మిగిలేది మూడు మాత్రమే
- విజయవాడ, గుంటూరు, గుంతకల్ ఇక విశాఖ జోన్ లోకి
- రూ. 6 వేల కోట్ల ఆదాయానికి ద.మ.రై పరిమితం
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలగా నిలిచిన విశాఖ రైల్వేజోన్ సాకారమైంది. జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోయల్ నిన్న ప్రకటించారు. అయితే, కొత్తగా ఏర్పడే జోన్, సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న దక్షిణ మధ్య రైల్వే ఆదాయానికి గండికొట్టనుంది. ద.మ.రై ఆదాయం సగానికి సగం తగ్గుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ ద.మ.రై.లో ఆరు డివిజన్లు ఉండగా, విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటుతో మూడు మాత్రమే మిగలనున్నాయి.
ఆపై ఇంతవరకూ దేశంలోనే అతిపెద్ద రైల్వే జోన్ లలో ఒకటిగా, మూడు రాష్ట్రాల్లో విస్తరించి, ఏటా రూ. 11 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని తెస్తున్న దక్షిణ మధ్య రైల్వే, ఇకపై రూ. 6 వేల కోట్ల ఆదాయానికి పరిమితం కానుంది. ఒక్క విజయవాడ విడిపోవడంతోనే రూ. 5 వేల కోట్ల వరకూ నష్టం రానుందని అంచనా.
ఎన్ని జోన్లు ఉన్నా, మొత్తం మీద ఆదాయం భారతీయ రైల్వేలకు వెళ్లిపోతుందన్న అభిప్రాయం నిజమే అయినా, ఖాజీపేట డివిజన్ డిమాండ్ సాకారం కాకపోవడం, ద.మ.రైలో భాగమైన నాందేడ్ డివిజన్ మహారాష్ట్రలో ఉండటంతో ఉద్యోగుల పంపకాలు క్లిష్టతరం కావచ్చని భావిస్తున్నారు.
మొత్తం 6,228 కిలోమీటర్ల పరిధిలో దక్షిణ మధ్య రైల్వే కార్యకలాపాలు సాగుతుండగా, విశాఖ జోన్ తో దాదాపు 3,040 కిలోమీటర్లను ద.మ.రై కోల్పోనుంది. ఇప్పటివరకూ దీనిలో భాగంగా ఉన్న గుంతకల్, విజయవాడ, గుంటూరు డివిజన్లు ఇకపై విశాఖ జోన్ లో భాగం కానున్నాయి.