India: సర్జికల్ స్ట్రయిక్స్-2 గురించి ముందుగా తెలిసింది ఈ ఏడుగురికే!
- అత్యంత గోప్యంగా దాడి వివరాలు
- ప్రతి అంశాన్ని పర్యవేక్షించిన ప్రధాని
- సహకరించిన భద్రతా సలహాదారు అజిత్ ధోవల్
పుల్వామా వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడికి దీటుగా భారత్ సర్జికల్ స్ట్రయిక్స్-2తో బదులిచ్చిన సంగతి తెలిసిందే. 40 మంది జవాన్ల మృతికి 350 మంది ఉగ్రవాదుల ప్రాణాలతో ప్రతీకారం తీర్చుకుంది భారత్. మంగళవారం ఉదయానికల్లా మీడియాలో ఈ విషయం ప్రముఖంగా ప్రసారమైంది. అసలు, ఎప్పుడు దాడి చేశారో, ఎప్పుడు తిరిగొచ్చారో కూడా రాడార్లకు తెలియనంత పకడ్బందీగా మెరుపుదాడులు నిర్వహించారు. అయితే ఈ సర్జికల్ స్ట్రయిక్స్ ను ఎంతో రహస్యంగా ఉంచారు.
ప్రతిపాదన దశ నుంచి అమలు చేసే వరకు దీని గురించి తెలిసినవాళ్లు కేవలం ఏడుగురు వ్యక్తులే. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా, నిఘా సంస్థ రా అధిపతి ధస్మానాకు మాత్రమే ఈ దాడులు గురించి తెలుసు. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) బాలాకోట్ లోని ఉగ్రస్థావరాల ఆనుపానులు భద్రతా దళాలకు వివరించింది. దాంతో పటిష్ఠమైన ప్లాన్ కు రూపకల్పన చేయడమే కాదు పకడ్బందీగా అమలుచేసి జాతి గర్వపడేలా చేశారు ఐఏఎఫ్ ఫైటర్ పైలెట్లు.