india: మెరుపు దాడుల సమయంలో పుట్టాడట.. అందుకే ‘మిరాజ్’ పేరు పెట్టారు!
- రాజస్థాన్ కు చెందిన దంపతులు మహావీర్-సోనమ్
- మెరుపుదాడుల సమయంలో మగబిడ్డ జననం
- ఆ బిడ్డ పేరులో ‘మిరాజ్’ వచ్చేలా నామకరణం
తమ తాతో, తండ్రిపైనో, ఓ సెలెబ్రిటీపైనో, రాజకీయ నేతపైనో ఉన్న అభిమానంతో తమ బిడ్డకు ఆ పేర్లను పెట్టుకోవడం చూస్తుంటాం. చరిత్ర పుటల్లో నిలిచిపోయే సంఘటనలు సంభవించినప్పుడు వాటి గుర్తుగా తమకు పుట్టిన బిడ్డలకు పేర్లు పెట్టుకునే వారూ లేకపోలేదు. ఇలాంటి సంఘటనే రాజస్థాన్ లో జరిగింది.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని బాలాకోట్ పై భారత్ వైమానిక దళం నిన్న తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మెరుపు దాడులు జరిపి, ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో మిరాజ్-2000 జెట్ ఫైటర్లు కీలకపాత్ర పోషించాయి. అయితే, ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మహావీర్, సోనమ్ దంపతులకు మగబిడ్డ జన్మించాడు.
భారత్ సాధించిన విజయానికి గుర్తుగా తమ బిడ్డకు ఈ జెట్ ఫైటర్ పేరు కలిసి వచ్చేలా నామకరణం చేయాలని వీరు భావించారు. దీంతో, పండంటి తమ బిడ్డకు ‘మిరాజ్ సింగ్ రాథోడ్’గా నామకరణం చేసినట్టు మీడియాకు తెలిపారు. తమ కుటుంబాల్లో కూడా సైన్యంలో పని చేస్తున్నవారు ఉన్నట్టు పేర్కొన్నారు.