karnool: కర్నూల్ ఎంపీ టికెట్ నాకు కేటాయిస్తేనే బాగుంటుంది : బుట్టా రేణుక
- అధిష్ఠానం ఆ దిశగా ఆలోచిస్తుందనుకుంటున్నా
- కేటాయింపుపై స్పష్టత రావాల్సి ఉంది
- కోట్ల కుటుంబం చేరికపై సమాచారం లేదు
కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీచేసే అవకాశం తనకు ఇస్తేనే బాగుంటుందని, ఈ విషయంలో టీడీపీ అధిష్ఠానం కూడా పాజిటివ్‌గా స్పందిస్తుందని భావిస్తున్నానని సిటింగ్ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచిన రేణుక అనంతరం టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో సహజంగానే కర్నూల్ సీటుపై సందేహాలు ముసురుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్న ఆమె అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
టికెట్టు తనకు కేటాయిస్తేనే బాగుంటుందని, ఈ విషయంలో టీడీపీ అధినేత నుంచి స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీలో చేరనున్నారన్న వార్తలపై తనకు ఎటువంటి సమాచారం లేదని రేణుక స్పష్టం చేశారు. కోట్ల ఫ్యామిలీ చేరికపై గుర్రుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి కేఈ కుటుంబ సభ్యులతో చంద్రబాబు చర్చలు జరిపి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రేణుక ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.