Pakistan: పాకిస్థాన్ సినిమా, మీడియా ప్రముఖులకు వీసాలు నిరాకరించండి!: మోదీకి భారత సినీ వర్కర్ల సంఘం లేఖ
- భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలను సమర్థిస్తాం
- ఉగ్రవాద దేశాలపై కఠిన నియంత్రణలు విధించాలి
- విదేశాంగ శాఖకు సైతం విజ్ఞప్తి చేసిన ఏఐసీడబ్ల్యూఏ
భారత్, పాకిస్థాన్ ల మధ్య దిగజారుతున్న సంబంధాలు సినీ రంగానికి కూడా విస్తరించాయి. పాకిస్థాన్ లో భారత సినిమాలు, ఇతర కంటెంట్ విడుదల కాకుండా దాయాది దేశం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రతిగా పాక్ సినిమా, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులకు వీసాలు జారీచేయరాదని అఖిల భారత సినీ వర్కర్ల సంఘం (ఏఐసీడబ్ల్యూఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఏ చర్యనైనా సమర్థిస్తామనీ, పూర్తి మద్దతు ఇస్తామని ఏఐసీడబ్ల్యూఏ లేఖలో తెలిపింది. ఉగ్రవాద సంస్థలకు ఊతమిచ్చే పాకిస్థాన్ వంటి దేశాలపై కఠిన నియంత్రణలు విధించాలని కోరింది. ఉగ్రకుట్రకు పాల్పడుతున్న పాక్ కు చెందిన కళాకారులు, మీడియా ప్రతినిధులకు వీసాలను నిరాకరిస్తూ నిర్ణయం తీసుకోవాలని భారత విదేశాంగ శాఖకు ఏఐసీడబ్ల్యూఏ విజ్ఞప్తి చేసింది.