Crime News: ఇల్లు కొనడానికని వచ్చి ఇల్లాలి హత్య... విశాఖలో దారుణం!

  • ఒంటిపైన, ఇంట్లో ఉన్న 70 తులాల బంగారం మాయం
  • సొత్తు కోసమే చంపేసి ఉంటారని అనుమానం
  • మృతురాలు కాంగ్రెస్‌ పార్టీ మహిళా నేత

విశాఖలో దారుణం వెలుగు చూసింది. ఓ వివాహితను ఇంట్లో ఎవరూ లేని సమయంలో చంపేసి ఆమె ఒంటిపైన, ఇంట్లో ఉన్న 70 తులాల బంగారాన్ని అపహరించారు. వారు అమ్మకానికి పెట్టిన ఇల్లు చూడడానికని వచ్చిన దుండగుడే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నారు. బంగారం కోసమే హత్య చేశాడా, మరేదైనా కారణం ఉందా? అన్నదానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

పోలీసుల కథనం మేరకు, విశాఖ, అక్కయ్యపాలెం ఎన్‌జీజీఓస్‌ కాలనీలోని పద్మభాస్కర్‌ ప్రకాష్‌ రెసిడెన్సీలోని ఫ్లాట్‌ నంబరు 502లో భోగసముద్రం విజయారెడ్డి (53), బి.వి.నారాయణరెడ్డి దంపతులు నివసిస్తున్నారు. నారాయణరెడ్డి ఎస్‌బీఐ ఉద్యోగికాగా, విజయారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తుంటారు. క్రియాశీలక రాజకీయాలకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె ఉండగా పెళ్లయి హైదరాబాద్‌లో ఉంటున్నారు.

తాము నివాసం ఉంటున్న ఫ్లాట్‌ను ఇటీవల విజయారెడ్డి దంపతులు అమ్మకానికి ఉంచారు. భీమిలికి చెందిన హేమంత్‌, రాధికలు ఈనెల 23న ఉదయం 8 గంటల సమయంలో వీరి ఫ్లాట్‌కి వచ్చి చూసి వెళ్లారు. సోమవారం ఉదయం 9గంటల సమయంలో ఓ వ్యక్తి పల్సర్‌ వాహనంపై అపార్ట్‌మెంట్‌కి వచ్చాడు. ఫ్లాట్‌ చూడడానికి వచ్చానని చెప్పడంతో వాచ్‌మెన్‌ పైకి తీసుకువెళ్లి 502 ఇల్లు చూపించి వచ్చేశాడు.

మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన విజయారెడ్డి భర్త నారాయణరెడ్డి తాళం వేసి ఉండడంతో భార్యకు ఫోన్‌ చేశారు. స్పందన లేకపోవడంతో వాచ్‌మన్‌ని అడిగాడు. పార్కింగ్‌లో కారు కూడా లేకపోవడంతో బయటకు వెళ్లి ఉంటారని ఊహించి తిరిగి ఆఫీసుకి వెళ్లిపోయారు. సాయంత్రానికి కూడా విజయారెడ్డి రాకపోవడం, బయట నుంచి ఇంటికి రెండు తాళాలు వేసి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంగళవారం ఉదయం నారాయణరెడ్డి అపార్ట్‌మెంట్లో ఉన్న వారిని పిలిచి వారి సమక్షంలో తలుపు తాళాలు విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బాత్‌రూంలో విజయారెడ్డి విగతజీవిగా పడివుండడంతో షాక్ కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. విజయారెడ్డిని ఇనుప రాడ్డుతో తలపై మోది దారుణంగా చంపేశారని గుర్తించారు. పడక గదిలో హత్యచేసిన దుండగుడు బాత్‌రూంలోకి మృతదేహాన్ని ఈడ్చుకుని వెళ్లి పడేసి ఉంటాడని భావిస్తున్నారు. నిందితుడు తన దుస్తులు కూడా అక్కడే వదిలేసి, నారాయణరెడ్డి దుస్తులు వేసుకోవడం బట్టి హత్య అనంతరం వాటిపై రక్తపు మరకలు ఉన్నందున ఎవరికీ అనుమానం రాకుండా  జాగ్రత్తపడి ఉంటాడని భావిస్తున్నారు.

అలాగే, ఘటన అనంతరం ఫ్లాట్‌ బయట తాళం వేసి తాను వచ్చిన పల్సర్‌ బైక్‌ను బయట వదిలేసి విజయారెడ్డి కారులో వెళ్లిపోవడం, సాయంత్రం మరోసారి వచ్చి విజయారెడ్డి ఇంటికి మరో తాళం వేసి, బైక్‌పై వెళ్లిపోవడం వంటి సంఘటనలు బట్టి ఎవరో కక్షతోనే ఈ హత్యచేసి ఉంటారన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆనవాళ్లు, గుర్తులను బట్టి హత్యకు పాల్పడింది ఒకరా? ఎక్కువ మందా? అని కూడా ఆరాతీస్తున్నారు.

విజయారెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేస్తున్నందున ఆ వ్యవహారాలేమైనా కారణమా? అని కూడా ఆలోచిస్తున్నారు. పైగా చంపిన తీరు చూస్తే కసి, కక్ష, ఆగ్రహంతో చేసినట్టుగా ఉండడంతో ఆర్థిక లావాదేవీల ప్రమేయం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా తన భార్య ఒంటిపైనా, ఇంట్లోని 70 తులాల బంగారం కనిపించడం లేదని నారాయణరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News