Pakistan: అణ్వాయుధాల టీమ్ ను సమావేశపరిచిన పాకిస్థాన్!
- ఇండియా, పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం
- నేషనల్ కమాండ్ అథారిటీతో ఇమ్రాన్ సమావేశం
- అణు బాంబులు వేసేంత ధైర్యం చేయలేదంటున్న నిపుణులు
తమ అధీనంలో ఉన్న భూమిపై భారత్ వైమానిక దాడులకు దిగిన నేపథ్యంలో, ఏదో ఒకటి చేసి తమ ఉనికిని చాటుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, నేడు నేషనల్ కమాండ్ అథారిటీని అత్యవసర సమావేశానికి పిలిచారు. పాకిస్థాన్ అణ్వాయుధాలను ఈ కమాండ్ అథారిటీయే నిర్వహిస్తుంది. కాగా, భారత వాయుసేన ఖాళీ ప్రాంతంలో బాంబులు విడిచిందని, ప్రాణనష్టం లేదని నిన్న ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్, ఆపై తాము కూడా ఇండియాకు సర్ ప్రైజ్ ఇస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్యా యుద్ధ వాతావరణం ఏర్పడగా, పాక్ ప్రధాని నేడు అణ్వాయుధాల టీమ్ తో సమావేశం నిర్వహించడం గమనార్హం.
కాగా, పాకిస్థాన్ అణు బాంబులతో దాడి చేస్తుందని భావించాల్సిన అవసరం లేదని మాజీ దౌత్యాధికారి కేసీ సింగ్ అభిప్రాయపడ్డారు. నేషనల్ కమాండ్ అథారిటీని సమావేశానికి పిలవడం కేవలం ఓ ఎత్తుగడ మాత్రమే కావచ్చని, తాము కూడా ఏదైనా చేయగలమన్న సంకేతాలు ఇచ్చేందుకే ఇమ్రాన్ ఈ పని చేసుండవచ్చని ఆయన అన్నారు. పాకిస్థాన్ ఒక్క బాంబు ఇండియాపై వేస్తే, 20 బాంబులు వచ్చి పాక్ పై పడతాయని మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే.