India: భారత్-పాక్ సరిహద్దు వద్ద సైన్యం ఆంక్షలు.. రాత్రివేళ రాకపోకలపై నిషేధం
- సరిహద్దులో సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఏడు వరకు నిషేధం
- ఏప్రిల్ మొదటి వారం వరకు ఆంక్షలు
- వచ్చే మూడు రోజులు బీఎస్‌ఎఫ్ పెట్రోలింగ్ పెంచాలని కేంద్రం ఆదేశం
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ వైమానిక దాడులు నిర్వహించిన తర్వాత సరిహద్దులో సైన్యం ఆంక్షలు విధించింది. ప్రతీకార దాడికి పాక్ సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన భారత్ సైన్యం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సరిహద్దు సమీపంలోని గ్రామాలను ఖాళీ చేయించకపోయినప్పటికీ పౌరుల రాకపోకలపై నిషేధం విధించింది. సరిహద్దుకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు రాత్రిపూట సంచరించవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
ఏప్రిల్ మొదటి వారం వరకు రాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు రాకపోకలపై నిషేధం విధించినట్టు సైన్యం తెలిపింది. అలాగే, సరిహద్దులో రానున్న మూడు రోజులపాటు బీఎస్ఎఫ్ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని కేంద్రం ఆదేశించింది.