Pakistan: పాక్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసిన రక్షణ మంత్రి పర్వేజ్ ఖటక్ వ్యాఖ్య
- సంయమనం లేకుండా చేస్తున్న ప్రకటనలతో అభాసుపాలు
- దీటుగా బదులివ్వడంతో వెనక్కి వెళ్లిపోయాయన్న ఆసిఫ్
- చీకటిగా ఉండటంతో స్పందించలేకపోయామన్న పర్వేజ్
నేడు భారత వైమానిక దళాలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిపిన మెరుపు దాడులు పాకిస్థాన్‌ను నవ్వులపాలు చేస్తున్నాయి. ఒకరికొకరు సంయమనం లేకుండా చేస్తున్న ప్రకటనలతో పాక్ అభాసుపాలవుతోంది. ఆర్మీ ఒక మాట చెబుతుంటే.. ప్రధాని మరో మాట చెబుతున్నారు. దీంతోనే పాక్ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారితే.. పాక్ రక్షణ మంత్రి పర్వేజ్ ఖటక్ వ్యాఖ్యలు పాక్‌ను మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేశాయి.
నేటి ఉదయం భారత దళాలు తమ భూభాగంలోకి వచ్చి దాడులకు యత్నించగా.. తాము దీటుగా బదులివ్వడంతో వెనక్కి వెళ్లిపోయాయని పాక్ ఆర్మీ ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మధ్యాహ్నానికి మాట మార్చిన పాక్... అసలు వైమానిక దాడులే జరగలేదని.. ఎలాంటి నష్టం తమకు వాటిల్లలేదని పేర్కొంది.
మరోవైపు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సరైన సమయం చూసి దెబ్బకొడతామంటూ పేర్కొన్నారు. ఇక తాజాగా రక్షణ మంత్రి పర్వేజ్ ఖటక్ మాట్లాడుతూ.. ‘భారత్‌ను తిప్పి కొట్టేందుకు పాక్ వైమానిక దళం సిద్ధంగానే ఉందని.. కానీ రాత్రివేళ చీకటిగా ఉండటంతో స్పందించలేకపోయిందని పేర్కొన్నారు. ఈ పొంతనలేని వ్యాఖ్యలతో పాక్ అభాసుపాలవుతోంది.