India: బాలాకోట్... అది ఉగ్రవాద స్థావరమా.. లేక ఫైవ్ స్టార్ రిసార్టా..!
- జైషే క్యాంప్ లో విలాసవంతమైన ఏర్పాట్లు
- టెర్రరిస్టుల కోసం స్విమ్మింగ్ పూల్
- అందుబాటులో అత్యాధునిక సౌకర్యాలు
పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన మెరుపుదాడుల్లో బాలాకోట్ లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. ఉగ్రవాదులు, వారి శిక్షకులు మాంచి గాఢనిద్రలో ఉన్న సమయంలో భారత వాయుసేన స్వల్ప వ్యవధిలోనే పెను విధ్వంసం సృష్టించింది. ఈ దాడిలో 300 మంది ఉగ్రవాదులు హతులైనట్టు తెలుస్తోంది. వారిలో 27 మంది ట్రైనర్లు కూడా ఉన్నట్టు సమాచారం.
అయితే, బాలాకోట్ స్థావరం తమకు ఎంతో సురక్షితం అనుకుని భావించిన జైషే అధినాయకత్వానికి ఈ సర్జికల్ స్ట్రయిక్ తో దిమ్మదిరిగిపోయింది. ఎందుకంటే, పర్వత ప్రాంతాల్లో దట్టమైన అటవీప్రాంతం నడుమ ఉన్న ఈ స్థావరం శత్రుదుర్భేద్యమని జైషే ఇప్పటివరకు భావిస్తూ వచ్చింది. అయితే భారత వాయుసేనకు చెందిన మిరేజ్-2000 విమానాలు బాలాకోట్ స్థావరంపై పిడుగుల వర్షం కురిపించాయి.
అసలు, బాలాకోట్ స్థావరం గురించి మీడియాలో అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటి ప్రకారం... బాలాకోట్ స్థావరం ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్ కు దీటుగా ఉంటుంది. విలాసవంతమైన నివాస భవనాలు, వాటిలో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ముఖ్యస్థావరం ఉగ్రవాదులకు స్వర్గధామం అని చెబుతారు.
సాధారణంగా టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్ అంటే కఠిన పరీక్షలకు నిలయంగా భావిస్తారు. కానీ బాలాకోట్ క్యాంప్ లో లగ్జరీకి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడకు తరచుగా జైషే అగ్రనేతలు వస్తుండడమే అసలు కారణం! ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా దర్శనమిస్తుంది. పెద్ద సంఖ్యలో వంటవాళ్లు, సిబ్బంది ఉంటారు. దాదాపు ఆరేడు వందల మందికి సరిపడా ఆహారపదార్ధాలు నిత్యం తయారుచేస్తుంటారు. మొత్తమ్మీద ఈ స్థావరం ఓ టూరిస్ట్ హిల్ స్టేషన్ లా కనిపిస్తుంది. అయితే, దీని చుట్టుపక్కల మరే నిర్మాణాలు లేకపోవడంతో భారత మిరేజ్ లకు వాటంగా దొరికింది. సెకన్ల వ్యవధిలో దీనిపై బాంబుల వర్షం కురిపించాయి.