India: మిరేజ్-2000.. పాతకాపు అయినా మోతమోగిస్తుంది!

  • ఐఏఎఫ్ కు నమ్మినబంటు
  • కీలక ఆపరేషన్లలో దీనికిదే సాటి
  • అమెరికా ఎఫ్-16లకు ఇదంటే హడల్

ఇప్పుడెక్కడ చూసినా సర్జికల్ స్ట్రయిక్స్-2 గురించే మాట్లాడుకుంటున్నారు. పాకిస్థాన్ సరిహద్దు వెంబడి వందల కిలోమీటర్ల పొడవునా ఉన్న ఉగ్రవాద శిబిరాలను భారత్ వాయుసేన మంగళవారం వేకువజామున భీకరమైన దాడులతో నేలమట్టం చేసి ప్రతీకారం తీర్చుకోవడం తెలిసిందే. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణత్యాగాలు ఊరికేపోవని ప్రధాని మోదీ అనడమే కాదు చేసి చూపించారు కూడా. అయితే ఈ దాడుల్లో భారత్ అత్యంత కచ్చితంగా లక్ష్యాలను ఛేదించడం వెనుక భారత వాయుసేన వ్యూహ చతురత దాగి ఉంది.

అసలు, తాజా సర్జికల్ స్ట్రయిక్స్ కోసం మిరేజ్-2000 యుద్ధ విమానాలను ఎంచుకున్నప్పుడే సగం సక్సెస్ అయ్యారు. ఎందుకంటే పాక్ తో మనకున్న సరిహద్దు ప్రాంతంలో పర్వతాలే ఎక్కువ. సాధారణంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ప్రీమియం స్థాయి యుద్ధవిమానాలంటే సుఖోయ్ ల పేర్లే చెబుతారు. అయితే సుఖోయ్ లు మైదాన ప్రాంతాల్లో తక్కువ ఎత్తులో ఎగరగలవు కానీ, పర్వతప్రాంతాల్లో కింది స్థాయి ఎత్తుల్లో ఎగరడం వాటికి చాలా కష్టమైన పని. కానీ మిరేజ్ లు అలా కాదు. వంపులు తిరిగిన లోయల్లో సునాయాసంగా పయనించడమే కాదు, వెంటబడుతున్న ప్రత్యర్థి జెట్లను అద్భుతమైన రీతిలో ఏమార్చగలవు.

దీనికున్న ఇంజిన్ పవర్ అత్యంత శక్తిమంతం అని చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యమైనది... దీని సామర్థ్యం. ఒక మీటరు విస్తీర్ణం ఉన్న ప్రదేశాన్ని సైతం కచ్చితంగా క్యారమ్ బోర్డులో కాయిన్స్ ను కొట్టినట్టు కొట్టేస్తుంది మిరేజ్ ఫైటర్ జెట్. ఈ విషయంలో అమెరికా తయారీ ఎఫ్-16లు కూడా దీనిముందు దిగదుడుపే. అందుకే బాలాకోట్ గగనతలంలో మిరేజ్ ల దండును చూడగానే తోకముడిచాయి పాక్ ఎఫ్-16 విమానాలు.

మిరేజ్ ప్రత్యేకతలు:

మిరేజ్ ప్రత్యేకతలు
  • మిరేజ్-2000 మల్టీ రోల్ సింగిల్ ఇంజిన్ విమానం.
  • లేజర్ గైడెడ్ బాంబులతో పాటు దాదాపు అన్ని రకాల మిసైళ్లను ప్రయోగించగలదు.
  • దీనికి థేల్స్ ఆర్ డీ వై-2 అనే అత్యాధునిక రాడార్ అమర్చి ఉంటుంది. ఇది లక్ష్యాలను 100 శాతం కచ్చితంగా గుర్తించడంలో సాయపడుతుంది.
  • లాంగ్ రేంజ్ టార్గెట్లను ఛేదించడంలో దీని ట్రాక్ రికార్డు అమోఘంగా ఉంది. 100 పర్సెంట్ సక్సెస్ రేట్ దీని సొంతం. అందుకే ఐఏఎఫ్ కు మిరేజ్ లను నమ్మినబంట్లు అని పిలుస్తారు.
  • ఇది భారత వాయుసేనలో 1985లో ప్రవేశించింది. 1999 కార్గిల్ వార్ లో దీనిదే కీలక పాత్ర.
  • ఇది సింగిల్ సీటర్, టు సీటర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • ఫ్రాన్స్ కు చెందిన డసో వైమానిక సంస్థ దీని తయారీదారు.
  • మిరేజ్-2000 విమానం నిమిషానికి 60,000 అడుగుల ఎత్తుకు దూసుకెళ్లగలదు.
  • అన్ని రకాల వాతావరణాల్లో ప్రయాణించగల సామర్థ్యం ఉన్న కొన్ని విమానాల్లో ఇది కూడా ఒకటి.
  • ముఖ్యంగా రాత్రివేళల్లో దాడులకు ఇది అత్యంత అనువైనది. కొన్నాళ్ల క్రితమే దీన్ని అప్ గ్రేడ్ చేశారు. కాక్ పిట్ గ్లాస్ నైట్ విజన్ కు అనుకూలంగా మలిచారు.
  • దీంట్లో తిరుగులేని వ్యవస్థ అంటే ఐఎఫ్ఎఫ్ అని చెప్పాలి. ఐఎఫ్ఎఫ్ అంటే ఐడెంటిఫికేషన్ ఫ్రెండ్ ఆర్ ఫో. అంటే ఎదురుగా వస్తున్న విమానం స్నేహితుడో, శత్రువో వెంటనే గుర్తించగల సాంకేతిక సామర్థ్యం అన్నమాట.
  • భారత్ తో మాత్రమే కాకుండా ఫ్రాన్స్, ఈజిప్ట్, యూఏఈ, పెరు, తైవాన్, గ్రీస్, బ్రెజిల్ దేశాలు కూడా మిరేజ్-2000 విమానాలను ఉపయోగిస్తున్నాయి.

  • Loading...

More Telugu News