Pakistan: మున్ముందు జరిగే పరిణామాలకు సైన్యం, ప్రజలు సిద్ధంగా ఉండండి: పాక్ ప్రధాని ఇమ్రాన్
- ప్రతీకార దాడులు చేసి తీరుతాం
- భారత్ ఆరోపణలను ఖండిస్తున్నాం
- మరోసారి సొంత డబ్బా కొట్టుకుంటోంది
- నిర్లక్ష్య పూరిత కట్టుకథలు చెబుతోంది
బాలాకోట్ లోని తీవ్రవాద శిబిరాలను మట్టుబెట్టామనీ.. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారన్న భారత్ వాదనను పాకిస్థాన్ తోసిపుచ్చింది. అయితే భారత వైమానిక దళాలు జరిపిన మెరుపు దాడులపై మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాము కూడా భారత్‌పై ప్రతీకార దాడులు చేసి తీరుతామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. బాలాకోట్‌పై భారత్ దాడి అనంతరం అత్యవసరంగా సమావేశమైన పాక్ జాతీయ భద్రతా మండలి(ఎన్ఎస్‌సీ).. మున్ముందు జరిగే పరిణామాలకు సైన్యం, ప్రజలు సిద్ధంగా ఉండాలని పేర్కొంది.
ఈ సమావేశానంతరం పాక్ ఒక ప్రకటన విడుదల చేసింది. బాలాకోట్‌లో దాడులు జరిపి పెద్దసంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చామంటూ భారత్ చేస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం మరోసారి సొంత డబ్బా కొట్టుకుంటోందని.. నిర్లక్ష్యపూరిత కట్టుకథలు చెబుతోందని వెల్లడించారు. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో శాంతి, స్థిరత్వాలను ఫణంగా పెట్టి మరీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. భారత్ దాడి చేసినట్టు చెబుతున్న ప్రాంతానికి జాతీయ మీడియాను తీసుకెళ్లి వాస్తవాలను వెల్లడిస్తామంటూ పాక్ ప్రకటనలో తెలిపింది.