Article 35A: ఆర్టికల్ ‘35-ఎ’తో ఆడుకోవద్దు.. మీరెప్పుడూ చూడనిది చూడాల్సి వస్తుంది: మెహబూబా ముఫ్తీ ఘాటు హెచ్చరిక
- నిప్పుతో చెలగాటం వద్దు
- కశ్మీరీలు ఏ జెండా పట్టుకుంటారో చెప్పలేను
- సుప్రీం విచారణ నేపథ్యంలో ముఫ్తీ తీవ్ర హెచ్చరికలు
ఆర్టికల్ 35ఎకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ఆర్టికల్ జోలికి వెళ్లొద్దని హెచ్చరించారు. దాని జోలికి వెళ్లడమంటే నిప్పుతో చెలగాటం ఆడడమేనన్నారు. దానితో ఆడుకుంటే గతంలో ఎప్పుడూ చూడని పరిణామాలను చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆర్టికల్ 35ఎపై దాడి జరిగితే కశ్మీర్ ప్రజలు త్రివర్ణ పతాకానికి బదులు ఏ పతాకాన్ని పట్టుకోవాల్సి వస్తుందో తానైతే చెప్పలేనని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
1954లో భారత రాజ్యాంగంలో చేరిన 35-ఎ ఆర్టికల్ ద్వారా కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు, అధికారాలు సంక్రమిస్తాయి. బయటి వ్యక్తులు ఇక్కడ ఏ రకంగా శాశ్వత పౌరులు కాకుండా ఈ ఆర్టికల్ అడ్డుకుంటుంది. అంటే.. కశ్మీర్‌లోని స్థిరాస్తులను బయటివారు ఏ విధంగానూ సొంతం చేసుకోకుండా ఇది రక్షణ కల్పిస్తుంది. రాష్ట్రానికి చెందిన మహిళను బయటి వ్యక్తి పెళ్లాడినప్పటికీ ఆమెకు ఆస్తిలో ఎటువంటి హక్కు సంక్రమించదు.
గత కొంతకాలంగా ఈ ఆర్టికల్‌పై దుమారం రేగుతోంది. ఈ ఆర్టికల్‌ను తొలగించేందుకు కుట్ర జరుగుతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేయనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్టికల్ 35-ఎ అనేది భారత రాజ్యాంగంలో భాగం కాదని, కాబట్టి విచారణను వాయిదా వేయాలంటూ జమ్ముకశ్మీర్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.