India: యుద్ధం చేయండి... పాకిస్థాన్ ను శుద్ధి చేయండి: బాబా రామ్ దేవ్ పిలుపు
- మాది చాలా ప్రశాంతమైన దేశం
- మా జోలికి వస్తే గుడ్లు పీకుతాం
- పాక్ ను టార్గెట్ చేసిన యోగా గురు
సుప్రసిద్ధ యోగా గురు బాబా రామ్ దేవ్ మరోసారి పాకిస్థాన్ పై ధ్వజమెత్తారు. భారతదేశం ఓ ప్రశాంతమైన దేశం అని, సున్నితమైన సంస్కృతికి ప్రతిరూపం అని పేర్కొన్నారు. అలాంటి తమ దేశంపై ఎవరన్నా పెడచూపులు చూస్తే వాళ్ల కళ్లు పీకేస్తామంటూ హెచ్చరించారు. పాకిస్థాన్ కు తగిన రీతిలో బుద్ధి చెప్పాలంటూ బాబా రాందేవ్ కేంద్రానికి సూచించారు.
"యుద్ధం చేయండి... పాకిస్థాన్ ను శుద్ధి చేయండి" అంటూ పిలుపునిచ్చారు. ఢిల్లీలో న్యూ మంత్రాస్ ఫర్ లైఫ్ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పైవ్యాఖ్యలు చేశారు. అయితే తాను అమాయకులను చంపాలని చెప్పడంలేదని, శాంతికి ముందు విప్లవం తప్పనిసరి అన్నది తన ఉద్దేశమని స్పష్టం చేశారు. "శాంతి కే లియే క్రాంతి జరూరీ హై" (శాంతి కావాలంటే దూకుడు తప్పనిసరి) అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు బాబా రాందేవ్.