Narendra Modi: ఐదుగురి కాళ్లు కడిగిన మోదీయే ఆస్కార్ ఉత్తమ నటుడు: తృణమూల్ ఎద్దేవా
- స్పూఫ్ వీడియో షేర్ చేసిన పార్టీ శ్రేణులు
- ప్రధాని నటనలో ఎవరికీ తీసిపోడంటూ సెటైర్
- ట్విట్టర్ లో వైరల్ అవుతున్న వీడియో
ప్రధాని నరేంద్ర మోదీపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన విమర్శల దాడిని కొత్తపుంతలు తొక్కిస్తోంది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం నేపథ్యంలో మోదీపై ఓ స్పూఫ్ వీడియో షేర్ చేసింది. అసాధారణ రీతిలో ఐదుగురు పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన ప్రధాని మోదీయే ఈ ఏటి ఆస్కార్ ఉత్తమ నటుడు అంటూ ఎద్దేవా చేసింది.
సాధారణంగా ఆస్కార్ లో ప్రతి విభాగానికి ఐదుగురు పోటీదారులు నామినేట్ అవుతారు. కానీ ఉత్తమ నటుడి విభాగంలో ప్రధాని నరేంద్ర మోదీకి పోటీయే ఉండదు. సోమవారం జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమనటుడి అవార్డును రామీ మాలెక్ కు అందించిన గ్యారీ ఓల్డ్ మన్, అలిసన్ జెన్నీ మోదీకి అవార్డు అందిస్తున్నట్టు ఈ స్పూఫ్ వీడియోలో చూపించారు.
అంతేకాదు, వాయిస్ ఓవర్ కూడా మార్చేసి "అండ్ ద అవార్డ్ గోస్ టు.. నరేంద్ర మోదీ" అనడం ఈ వీడియోలో నవ్వు పుట్టించేలా ఉంది. అయితే మోదీకి ఎందుకు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాల్సి వచ్చిందో కూడా సోదాహరణంగా ప్రదర్శించారు. లేటెస్ట్ గా ఆయన కుంభమేళాలో ఐదుగురు పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడగడం మీడియాలో హైలైట్ అయింది. ఆ క్లిప్పింగ్ నే ఈ స్పూఫ్ వీడియోలో మోదీ నటనా చాతుర్యంగా పేర్కొన్నారు! ఆ తర్వాత ఆయన్ను పెద్ద సంఖ్యలో వ్యక్తులు అభినందిస్తూ కనిపిస్తారు. వీడియో చివర్లో ఆస్కార్ అవార్డుతో ఫొటోకు పోజిస్తున్న ప్రధాని మోదీ చిత్రం దర్శనమిస్తుంది. మొత్తమ్మీద ఈ వీడియో ట్విట్టర్ లో మిశ్రమ స్పందనలు రాబడుతోంది.