Andhra Pradesh: నా మాటలు వక్రీకరించారు..ఆ వీడియో చూసి ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు: చింతమనేని

  • నేను ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడలేదు
  • అసలు, ఆ వీడియో నిడివి 2 నిమిషాల 30 సెకండ్లు
  • ఎడిట్ చేసి 30 సెకండ్లు చూపించేలా చేశారు

ఎస్సీలకు, తనకు మధ్య అగాధం సృష్టించాలని వైఎస్ జగన్ చూస్తున్నారని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. గతంలో తన ప్రసంగానికి సంబంధించిన ఓ వీడియోలో దళితులపై తాను అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ఎడిట్ చేసి పోస్ట్ చేశారని, తన మాటలను వక్రీకరించారని స్పష్టం చేశారు.

కొంత మంది వ్యక్తులకు మద్యం సరఫరా చేసి తన మీటింగ్ ని అపఖ్యాతిపాలు చేసేందుకు వాళ్లను అడ్డుపడమని పురమాయించారని, వాళ్లను మందలిస్తున్న సందర్భంలో తాను ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ఉన్నటువంటి వీడియోను ఎడిట్ చేసి 30 సెకండ్లు చూపించేలా చేశారని ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ఎస్సీ సంఘాల వారికి, పౌరులకు విఙ్ఞప్తి చేస్తున్నానని, ఒకవేళ ఈ 30 సెకన్ల వీడియో చూసి ఎవరైనా బాధపడి ఉంటే తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.

తప్పు చేసింది వాళ్లయినా తనపై పెట్టారని, ప్రజాక్షేత్రంలో తనను దోషిగా నిలబెట్టారు కనుక వాళ్ల తరపున కూడా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. పూర్తి వీడియోను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాలని కోరారు. ఎవరు తవ్వుకున్న గోతిలో వారు పడతారంటూ జగన్ పై నిప్పులు చెరిగారు. దళితులపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానని నిరూపిస్తే కనుక రాజకీయాల నుంచి వైదొలుగుతానని అన్నారు. ఎమ్మెల్యే పదవి కోసం తాను రాజకీయాలు చేయడం లేదని, తనను ఎదుర్కొనేందుకు కుట్ర రాజకీయాలు చేయడం సరికాదని, రాజకీయ దివాళాకోరు తనానికి ఈ సంఘటనే నిదర్శనమని అన్నారు.

  • Loading...

More Telugu News