Sonakshi Sinha: ఒప్పందాన్ని ఉల్లంఘించిన సోనాక్షి సిన్హా.. చీటింగ్ కేసు
- ఈవెంట్‌కు ఒప్పందం కుదుర్చుకుని గైర్హాజరు
- సోనాక్షి ఖాతాకు రూ.32 లక్షలు బదిలీ
- దుష్ప్రచారాన్ని ఆపకుంటే చర్యలు తీసుకుంటామన్న సోనాక్షి
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 2018 సెప్టెంబరు 30న ఢిల్లీలో ఏర్పాటు చేసిన ‘ఇండియా ఫ్యాషన్ అండ్ బ్యూటీ అవార్డు’ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సోనాక్షితో పాటు మాళవిక పంజాబీ, అభిషేక్ సిన్హా, ఎద్గార్ సకారియా, థుమిల్ ఠక్కర్.. రూ.37 లక్షలతో ఒప్పందం కుదుర్చుకుని చివరి నిమిషంలో గైర్హాజరయ్యారని ఆర్గనైజర్లు ఫిర్యాదు చేసినట్టు మొరాదాబాద్ డీఎస్పీ గజరాజ్ సింగ్ తెలిపారు.
ఈ కేసుపై సోనాక్షి సిన్హా మేనేజ్‌మెంట్ సంస్థ మాట్లాడుతూ.. అవన్నీ అవాస్తవాలనీ.. తమపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ కేసులో పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఈవెంట్ ఆర్గనైజర్ శర్మ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. అనంతరం ఆయన చెబుతూ, ఒప్పందంలో భాగంగా సోనాక్షి ఖాతాకు రూ.32 లక్షలు బదిలీ చేశామన్నారు.