Priyadarshi: హిట్ అయితే క్రెడిట్ తీసుకునేవారు.. ఫ్లాఫ్ అయ్యేసరికి ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు: ‘మిఠాయి’ దర్శకుడు
- పూర్తి బాధ్యత నాదే
- ‘మిఠాయి’ విషయంలో గర్వపడతా
- బాధలో ఉన్నా కానీ కుంగిపోలేదు
ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో ప్రముఖ హాస్యనటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి నటించిన చిత్రం ‘మిఠాయి’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. తాజాగా ప్రశాంత్ ఈ చిత్రం గురించి ఒక ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వని సినిమా తీసినందుకు పూర్తి బాధ్యత తనదే తప్ప మరెవ్వరిదీ కాదని ఆయన పేర్కొన్నారు. ‘మిఠాయి’ తీసినందుకు గర్వంగా ఉందని.. ఇకపై తను తీసే సినిమాలు హిట్ అయినా కూడా ‘మిఠాయి’ విషయంలో మాత్రం గర్వపడతానని తెలిపారు.
ముందు నుంచి చిత్రబృందానికి తాను సినిమా హిట్ అయితే సక్సెస్ పార్టీ.. ఫ్లాప్ అయితే ఫెయిల్యూర్ పార్టీ చేసుకుందామని చెబుతూనే ఉన్నానని ఆయన తెలిపారు. సినిమా రూ.100 కోట్లు రాబట్టి ఉంటే ప్రతి ఒక్కరూ క్రెడిట్ తీసుకునేవారని.. కానీ ఫ్లాప్ అయ్యే సరికి ఒక్కొక్కరిగా తప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. సినిమా ఫ్లాప్ అయినందుకు బాధలో ఉన్నాను కానీ కుంగిపోలేదన్నారు. తాను ఒంటరిని కానని.. తనతో మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగరంద్, కెమెరామెన్ రవి వర్మన్ నీలమేఘం, సౌండ్ డిజైనర్ సచిన్ సుధాకరానంద్ ఉన్నారన్నారు. మరోవైపు ఈ చిత్ర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేయడంతో ఆయన ట్విట్టర్ నుంచి వైదొలిగారు.