pm: మళ్లీ మే నెల చివరి ఆదివారం మాట్లాడతా: ‘మన్ కీ బాత్’ లో ప్రధాని మోదీ
- త్వరలో ఎన్నికలు రానున్నాయి
- ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది
- ప్రజల ఆశీస్సులతోనే మళ్లీ మే నెలలో మాట్లాడతా
మళ్లీ మే నెల చివరి ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడతానని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మోదీ మాట్లాడారు. త్వరలో ఎన్నికలు రానున్నాయి కనుక, మళ్లీ మే నెల చివరి ఆదివారం నిర్వహించే ‘మన్ కీ బాత్’ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతానంటూ తమ గెలుపు ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు.
‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో తన ప్రసంగం ప్రారంభించడానికి ముందు, పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ప్రజల ఆశీస్సులతోనే మళ్లీ మే నెలలో ప్రజలతో మాట్లాడతానని చెప్పారు. త్వరలో ఎన్నికలు రానున్నాయని, ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది కనుక ఇలాంటి కార్యక్రమాలు నిర్ణయించకూడదని, అందుకే, మళ్లీ మే నెల చివరి ఆదివారం మాట్లాడతానని అన్నారు.
ఈ సందర్భంగా జవాన్ల గురించి మాట్లాడుతూ, మన దేశానికి సేవ చేస్తున్న జవాన్లకు ఎంతో రుణపడి ఉన్నామని, జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఫిబ్రవరి 29న మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ జయంతి, మార్చి 3న బిర్సా ముండా, జంషెడ్ టాటా జయంతి సందర్భంగా వారిని ఆయన స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం గురించి ప్రస్తావించారు. ఎన్నికల సమయంలోఈసీ విశేష కృషి చేస్తోందని అన్నారు. దేశంలోని యువత ఓటు వేయడానికి ముందుకు రావాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ఓటు వేయడం తప్పనిసరి అని మోదీ సూచించారు.