India: జార్ఖండ్ లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. ముగ్గురిని కాల్చిచంపిన భద్రతాబలగాలు!
- జార్ఖండ్ లోని గుమ్లాలో ఎన్ కౌంటర్
- లొంగిపోవాలని కోరినా కాల్పులు జరిపిన మావోలు
- ఇంకా కొనసాగుతున్న ఆపరేషన్
జార్ఖండ్ లో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య ఈరోజు భీకర ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా చురుగ్గా స్పందించిన బలగాలు ముగ్గురు మావోయిస్టులను హతమార్చాయి. జార్ఖండ్ లోని గుమ్లా ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసులకు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దీంతో 209 కోబ్రా బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్, జార్ఖండ్ పోలీసుల సంయుక్త బృందం ఈరోజు ఉదయం కూంబింగ్ చేపట్టింది.
దీంతో గుమ్లా సమీపానికి రాగానే భద్రతాబలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. లొంగిపోవాలని అధికారులు కోరగా, మావోయిస్టులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో భద్రతాబలగాలు కూడా ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు ప్రారంభించాయి.
కాగా, కాల్పులు ఆగిపోయిన అనంతరం ఘటనాస్థలం నుంచి ముగ్గురు మావోల మృతదేహాలతో పాటు రెండు ఏకే-47 తుపాకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తప్పించుకున్న మావోయిస్టుల కోసం భద్రతాబలగాలు గాలింపును కొనసాగిస్తున్నాయి.