peddagattu jatara: పెద్దగట్టు జాతరకు వేళాయే... ఈరోజు అర్ధరాత్రి నుంచి మొదలు

  • 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
  • మేడారం తర్వాత రెండో అతి పెద్ద ఉత్సవం ఇదే
  • భారీ ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్రంలో మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్ద(గొల్ల)గట్టు జాతర ఈ రోజు ప్రారంభం కానుంది. మేడారం సమ్మక్క-సారమ్మ జాతర దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా గుర్తింపు సాధిస్తే, సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని  పెద్దగట్టు లింగమంతు స్వామి జాతరకు ఆ స్థాయి పేరుంది. యాదవులు ఇష్టదైవంగా కొలిచే లింగమంతుస్వామి జాతరను మేడారం జాతరలాగే రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. కాకపోతే మేడారం జాతర జరిగిన మరుసటి సంవత్సరం పెద్దగట్టు జాతర నిర్వహిస్తారు.

నేడు ప్రారంభమవుతున్న ఈ జాతర ఈనెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. ఐదు రోజులపాటు సాగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలతోపాటు చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. రెండేళ్ల క్రితం జరిగిన జాతరకు దాదాపు పది లక్షల మంది భక్తులు తరలివచ్చారని అంచనా. ఈ ఏడాది 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా పేరున్న లింగమంతుస్వామికి రెండేళ్ల మొక్కును చెల్లించుకుంటారు.

ఈరోజు అర్ధరాత్రి నుంచి జాతర ప్రారంభమవుతుంది. కానీ మధ్యాహ్నానికే పెద్ద సంఖ్యలో భక్తులు గట్టుకు చేరుకుంటారు. రాత్రయ్యే సరికి భక్తుల తాకిడి ఎక్కువవుతుంది. ఉత్సవంలో భాగంగా సంప్రదాయబద్ధంగా సూర్యాపేట మండలం కేసారంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవరపెట్టెను (అందనపు చౌడమ్మను) గట్టుకు చేరుస్తారు. ఒక ప్రదక్షిణ అనంతరం పెట్టెను గుడి ఆవరణలో ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. దేవరపెట్టె చేరుకున్నాకే మొక్కు చెల్లించాలన్నది భక్తుల నమ్మకం. అందుకే పెట్టె రాక కోసం ఎదురు చూస్తారు. పెట్టె రాగానే దానిని తాకి కళ్లకు అద్దుకుంటే పుణ్యం వస్తుందని పోటీ పడతారు.

దేవరపెట్టెను గుడి ఆవరణలో పెట్టి పూజలు చేయగానే భక్తులు తమ వెంట తెచ్చిన మంద గంపలతో (గంపను పసుపు, కుంకుమలు, పూలతో అలంకరించి అందులో పాలు, నెయ్యి, బియ్యం, కొబ్బరికాయ, అగరుబత్తీలు, హారతి కర్పూరం, అగ్గిపెట్టె, నిమ్మకాయలు, నూతన బోనం కుండ, చిప్ప, పువ్వులు తదితర పూజా సామగ్రితో) లింగమంతులస్వామి, చౌడమ్మ ఆలయాల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు.  భక్తులు భేరీల మోతలతో గజ్జెల లాగులు ధరించి, అవసరాలు, వీరతాళ్లు చేత పట్టుకొని చేసే నృత్యాలు ఆకట్టుకుంటాయి. అనంతరం సోమవారం తెల్లవారు జామున ముందుగా లింగమంతుల స్వామికి, చౌడమ్మ అమ్మవార్లకు నైవేధ్యం సమర్పించిన తరువాత ప్రత్యేక పూజలు చేస్తారు.

  • Loading...

More Telugu News