shiv sena: దేవుడ్ని కాసేపు పక్కన పెట్టి దేశం గురించి ఆలోచించండి: శివసేన
- నినాదాన్ని మార్చుకున్న శివసేన
- ఆరెస్సెస్ నిర్ణయానికి మద్దతు
- మహాకూటమిపై విమర్శలు
నిన్నమొన్నటి వరకు ‘ముందు మందిరం.. తర్వాతే ప్రభుత్వం’ అని నినదించిన శివసేన ఇప్పుడు మాట మార్చింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ‘ముందు దేశం.. తర్వాత మందిరం’ అనే నినాదాన్ని అందుకుంది. ఈ మేరకు తన అధికారిక పత్రిక సామ్నాలో రాసుకొచ్చింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో రామ మందిర నిర్మాణాన్ని కాసేపు పక్కనపెట్టి కశ్మీర్ అంశంపై దృష్టిపెట్టాలన్న ఆరెస్సెస్ నిర్ణయం సమర్థనీయమేనని పేర్కొంది.
పుల్వామా లాంటి దాడులను తిప్పికొట్టాలంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలని, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి వల్ల అది సాధ్యం కాదని తేల్చి చెప్పింది. బలమైన నాయకుడితోపాటు స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడే ఉగ్రవాదాన్ని నిర్మూలించి, పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పగలమని అభిప్రాయపడింది.
ఈ ఐదేళ్లలో పాకిస్థాన్ పై కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది. గత ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతంగా ప్రస్తుతం కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదాన్ని నిలువరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని శివసేన ఆరోపించింది.