kashmir: కశ్మీరీలను కాపాడే బాధ్యత నాదే.. జవాన్లపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం: మోదీ
- భారత్ చేస్తున్న పోరాటం కశ్మీర్ కోసమే
- కశ్మీరీలపై ఎవరూ దాడులకు పాల్పడవద్దు
- ఉగ్రవాదంపై పోరాటంలో కశ్మీరీ యువతను కలుపుకు పోవాలి
పుల్వామా ఉగ్రదాడి అనంతరం దేశ వ్యాప్తంగా కశ్మీరీలపై జరుగుతున్న దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ప్రతి కశ్మీరీ బిడ్డను కాపాడే బాధ్యత తనదే అని చెప్పారు. కశ్మీరీలపై ఎవరూ దాడి చేయవద్దని... దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్న వారికి ఇది ఊతమిస్తుందని అన్నారు. భారత్ చేస్తున్న పోరాటం కశ్మీర్ కోసమేనని... తమ పోరాటం కశ్మీర్ కు వ్యతిరేకం కాదని చెప్పారు. రాజస్థాన్ లోని టోంక్ లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదంపై పోరాటంలో కశ్మీరీ యువతను కలుపుకుని పోవడం ముఖ్యమని మోదీ అన్నారు. ఉగ్రవాదం వల్ల కశ్మీరీలు చాలా నష్టపోతున్నారని... వారిని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. జవాన్లపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు.