Special Category Status: ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని జాతీయ అజెండాలో రాహుల్‌ చేరుస్తానన్నారు: రఘువీరారెడ్డి

  • ప్రధాని అయితే తొలి సంతకం దానిపైనే అని చెప్పారు
  • ఆయన తిరుపతి పర్యటనతో వెయ్యేనుగుల బలం వచ్చింది
  • ఏపీకి లేదంటూ గోవాకు హోదా ఇస్తామంటున్న బీజేపీపై మండిపాటు

విభజన హామీల్లో అత్యంత ముఖ్యమైన ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా’ అంశాన్ని జాతీయ అజెండాలో చేరుస్తానని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాందీ చెప్పారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. రానున్న ఎన్నికల తర్వాత రాహుల్‌ ప్రధాని అయితే తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదాపైనే పెడతానని చెప్పారని వివరించారు. నిన్న తిరుపతిలో జరిగిన ఏపీ ప్రత్యేక హోదా భరోసా యాత్రకు రాహుల్‌ హాజరైన విషయం విదితమే. కార్యక్రమం విజయవంతంగా పూర్తికావడంతో ఈరోజు ఉదయం రఘువీరారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.  

రాహుల్‌ భరోసాతో వెయ్యేనుగుల బలం వచ్చినట్టుగా ఆంధ్రప్రజలు భావిస్తున్నారని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని తెలిపారు. హోదా భరోసా యాత్ర మార్చి 31వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇదే సమయంలో బీజేపీ తీరుపై రఘువీరారెడ్డి విరుచుకుపడ్డారు. ఓ వైపు ఆంధ్రాకు ప్రత్యేక హోదా లేదంటున్న కమలనాథులు మరోవైపు గోవాకు ఎలా హోదా ఇస్తామని చెబుతున్నారని ప్రశ్నించారు. ఇది బీజేపీ ద్వంద్వనీతికి నిదర్శనమని విమర్శించారు.

  • Loading...

More Telugu News