Chiranjeevi: కోడి రామకృష్ణ ప్రేమ వ్యవహారం గురించి చెప్పిన చిరంజీవి!
- ప్రేమ వ్యవహారంలో సలహాలు, సూచనలు అడిగేవారు
- వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేవారు
- అనుబంధాన్ని గుర్తు చేసుకున్న మెగాస్టార్
తెలుగు సినీ చరిత్రలో గణనీయమైన సక్సెస్ రేట్ ఉన్న దర్శకుల్లో కోడి రామకృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఆయన దర్శకత్వం వహించిన చాలా చిత్రాలు ఘనవిజయం సాధించాయి. కమర్షియల్ సినిమాల దర్శకత్వానికి కొత్త ఒరవడి దిద్దిన ప్రతిభావంతుడు కోడి రామకృష్ణ. ఆయన నేటి మధ్యాహ్నం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కోడి రామకృష్ణ మృతికి తెలుగు చిత్రసీమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది. ఆయనతో అనుబంధం ఉన్న సినీ ప్రముఖులు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగాలకు గురవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కోడి రామకృష్ణతో తన స్నేహాన్ని మీడియాతో పంచుకున్నారు. కోడి రామకృష్ణ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంలో చిరునే హీరో. అప్పటికి చిరు ఓ సాధారణ హీరో మాత్రమే.
ఆ తర్వాత ఆలయశిఖరం షూటింగ్ సమయంలో కోడి రామకృష్ణ గారు పద్మగారితో ప్రేమ వ్యవహారంలో తలమునకలై ఉన్నారని చిరంజీవి వెల్లడించారు. దాంతో షూటింగ్ స్పాట్ లో తన లవ్ స్టోరీ మొత్తం చెప్పేసి, సలహాలు, సూచనలు కోరేవారని చిరు గుర్తుచేసుకున్నారు. తాను కూడా ఆయన ప్రేమకు గట్టిగానే మద్దతిచ్చినట్టు తెలిపారు. ఆలయశిఖరం షూటింగ్ పూర్తయ్యే సమయానికి ప్రేమ కారణంగా తామిద్దరం మంచి స్నేహితులం అయిపోయినట్టు వివరించారు. ప్రేమ వ్యవహారాలే కాకుండా ఇతర వ్యక్తిగత విషయాలు కూడా తనతో అరమరికల్లేకుండా పంచుకునేవారని చెబుతూ చిరు ఎమోషనల్ అయ్యారు. రీసెంట్ గా ఆయనను చూసినప్పుడు సరిగా నడవలేని స్థితిలో ఉన్నా తన ఊతపదం "సంపేద్దాం గురూ" అనడం మాత్రం మానలేదని చెప్పారు.