India: ఉగ్రవాద లింకులున్న దేశాలను సాగనంపండి: ఐసీసీని కోరిన బీసీసీఐ
- మా ఆటగాళ్లకు ముప్పుంది
- పుల్వామా దాడిని చాలా దేశాలు ఖండించాయి
- లేఖలో విజ్ఞప్తి చేసిన బీసీసీఐ సీఈవో
ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్ కప్ లో పాల్గొనడంపై తమకు భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయని బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ అంటున్నారు. ఐసీసీ నిర్వహించే ఈ మెగా టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లు, అంపైర్లు, ఇతర సిబ్బంది భద్రతపై తమకు సందేహాలున్నాయంటూ జోహ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఐసీసీకి లేఖ రాశారు. భారత క్రికెట్ ఆటగాళ్లకు, అధికారులకు, అభిమానులకు ఐసీసీ వరల్డ్ కప్ లో మరింత భద్రత కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగివున్న దేశాలను ఐసీసీ తక్షణమే తన సభ్య దేశాల జాబితా నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు జోహ్రీ. తద్వారా పరోక్షంగా పాకిస్థాన్ పై వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడి ఘటనను యూకే సహా అనేక దేశాలు తీవ్రంగా ఖండించాయని, భారత్ కు తమ సంఘీభావం ప్రకటించాయని లేఖలో తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించే దేశాలతో సంబంధాలను తెంచుకోవాలంటూ క్రికెట్ ప్రపంచాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు.