Pakistan: యుద్ధాలతో రాటుదేలిన సైన్యం మాది... పాక్ తో పెట్టుకోవద్దు: సైనిక జనరల్ హెచ్చరిక
- పుల్వామా దాడికి, మాకు సంబంధం లేదు
- ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం
- భారత్ దాడిని తిప్పికొట్టే సత్తా మాకుంది
జమ్మూకశ్మీర్ లోని పుల్వామా వద్ద గత గురువారం జరిగిన ఉగ్రదాడిలో పెద్ద సంఖ్యలో సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగినప్పటి నుంచి భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. పుల్వామా ఆత్మాహుతి దాడిని భారత్ మునుపెన్నడూ లేనంత తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో పాక్ వర్గాలు యుద్ధ సన్నద్ధత గురించి మాట్లాడుతున్నాయి. పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. విస్తృతస్థాయిలో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, తమతో పెట్టుకోవద్దని భారత్ ను హెచ్చరించారు. యుద్ధాలతో రాటుదేలిన పాకిస్థాన్ సైన్యం ఎలాంటి ప్రమాదాన్నయినా తిప్పికొడుతుందని అన్నారు.
తమ దేశ సార్వభౌమత్వానికి ఆపద వాటిల్లే పరిస్థితి వస్తే ప్రతిదాడి చేసే హక్కు తమకుందని ఆ మేజర్ జనరల్ ఉద్ఘాటించారు. తమకై తాము యుద్ధం ప్రారంభించబోమని ఆయన స్పష్టం చేశారు. భారతే యుద్ధానికి కాలుదువ్వుతోందని ఆరోపించారు. పుల్వామా దాడిలో తమపై ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత్ ఆరోపణలు గుప్పిస్తోందని విమర్శించారు. 1998లో అణుపరీక్షలు జరిపినప్పటి నుంచి తమ దేశంలో భారతదేశమే ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తూ వస్తోందని కొత్త వాదన వినిపించాడీ పాకిస్థాన్ మేజర్ జనరల్.