Andhra Pradesh: ఏపీ విభజన విషయంలో కాంగ్రెస్ చేసిన పాపం ఎన్ని గుళ్లు తిరిగినా పోదు!: కన్నా లక్ష్మీనారాయణ
- పార్లమెంటు తలుపులు మూసి విభజించినప్పుడు నిద్రపోయారా?
- మీరు, మీ పచ్చతోక పార్టీ 2019లో మూల్యం చెల్లిస్తారు
- ట్విట్టర్ లో రాహుల్ గాంధీకి కన్నా హెచ్చరిక
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం శ్రీవారిని దర్శించుకోవడానికి రాహుల్ తిరుమల కొండపైకి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరగనున్న బహిరంగ సభలో రాహుల్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాహుల్ గాంధీపై విమర్శల వర్షం కురిపించారు. ఏపీని అన్యాయంగా పార్లమెంటు తలుపులు మూసి విభజించినప్పుడు రాహుల్ నిద్రపోయారా? అని ప్రశ్నించారు.
ఈరోజు కన్నా ట్విట్టర్ లో స్పందిస్తూ..‘@RahulGandhi.. మీ స్వార్థం కోసం పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించినప్పుడు మీరు నిద్ర పోయారా? దేశంలో ఎన్ని గుళ్ళకు తిరిగినా భస్మాసుర హస్తంతో కాంగ్రెస్ ఏపీ విషయంలో చేసిన పాపం ఎప్పటికీ పోదు. మీ అసమర్థతకు, మీ "పచ్చ తోక పార్టీ" అవినీతికి 2019లో మూల్యం చెల్లిస్తారు’ అని హెచ్చరించారు.