Ranga Reddy District: కేసు తీవ్రతను తగ్గించేందుకు దొంగలతో బేరమాడిన ఎస్సై.. ఏసీబీకి పట్టించిన చోరులు

  • రూ. 1.60 లక్షలు డిమాండ్ చేసిన ఎస్సై
  • ఏసీబీని ఆశ్రయించిన నిందితులు
  • రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎస్సైని దొంగల ముఠా ఏసీబీకి పట్టించి సంచలనం సృష్టించింది. మహేశ్వరం మండలం అమీర్‌పేటకు చెందిన రాజు, మెయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లికి చెందిన నజీర్ ముఠాగా ఏర్పడి పశువులను దొంగలిస్తున్నారు. దొంగిలించిన పశువులను రుద్రారంలోని అల్‌కబీర్ వధ శాలలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.  

పశువుల దొంగతనాలపై వరుసగా కేసులు నమోదవుతుండడంతో రంగంలోకి దిగిన మహేశ్వరం పోలీసులు దొంగల ముఠాపై కన్నేశారు. నజీర్, రాజులే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన ఎస్సై జి.నర్సింహులు వారిని కలిసి లంచం డిమాండ్ చేశాడు. కేసు తీవ్రతను తగ్గించేందుకు తనవంతు సాయం చేస్తానని, అందుకు రూ.1.60 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దొంగిలించిన పశువులను కొనుగోలు చేస్తున్న హర్షద్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేకుండా చేసేందుకు మరో రూ.10 వేలు ఇవ్వాలని కోరాడు.

దీంతో నిందితులందరూ కలిసి ఏసీబీని ఆశ్రయించారు. గతంలో రూ.60 వేలు తీసుకున్న ఎస్సై నర్సింహులును గురువారం మరో రూ. 80 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సైని అదుపులోకి తీసుకున్నారు.

Ranga Reddy District
Maheshwaram
SI
Bribe
cattle thief
Telangana
  • Loading...

More Telugu News