London: గంటకు 1289 కిలోమీటర్లు... వేగంలో సరికొత్త రికార్డు నెలకొల్పిన వర్జిన్ అట్లాంటిక్ విమానం
- డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇదే హయ్యస్ట్
- ధ్వనివేగంతో పోటీపడుతూ ప్రయాణం
- 9 గంటల్లోనే లాస్ ఏంజెలిస్ నుంచి లండన్
సాధారణంగా కమర్షియల్ పాసెంజర్ విమానాలు గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే అది గొప్ప ఘనతగా భావిస్తారు. కానీ వర్జిన్ అట్లాంటిక్ విమానయాన సంస్థకు చెందిన డ్రీమ్ లైనర్ విమానం సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విమానం గంటకు 1289 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి డ్రీమ్ లైనర్ విమానాల గత రికార్డులను తిరగరాసింది. ఈ బోయింగ్ తయారీ 787 డ్రీమ్ లైనర్ విమానం లాస్ ఏంజెలిస్ నుంచి లండన్ వెళుతుండగా న్యూయార్క్ గగనతలంపై అత్యుత్తమ వేగాన్ని నమోదు చేసింది. ఈ అసాధారణ వేగానికి జెట్ స్ట్రీమ్ కారణం అని వైమానిక రంగ నిపుణులు భావిస్తున్నారు.
గాల్లో కొన్ని వేల అడుగుల ఎత్తులో వాయు ప్రవాహాలు ఉంటాయని, వాటిలోకి ప్రవేశించిన ఏ వస్తువు అయినా అనాయాసంగా రెట్టింపు వేగాన్ని అందిపుచ్చుకుంటుందని నిపుణులు వివరించారు. దీన్నే వైమానిక పరిభాషలో టెయిల్ విండ్ ఎఫెక్ట్ అంటారు. అర్ధ దశాబ్ద కాలంలో ఇలాంటి వేగం ఎక్కడా నమోదు కాలేదని తెలుస్తోంది.
వర్జిన్ అట్లాంటిక్ విమానం కూడా టెయిల్ విండ్ లో చిక్కుకోవడంతో ఓ దశలో ధ్వనివేగంతో పోటీపడుతూ ప్రయాణించినట్టు ఫ్లయిట్ టెక్నికల్ డేటా చెబుతోంది. గతంలో ఓ డ్రీమ్ లైనర్ విమానం నమోదు చేసిన అత్యుత్తమ వేగం గంటకు 913 కిలోమీటర్లు. లేటెస్ట్ గా వర్జిన్ అట్లాంటిక్ విమానం ఆ రికార్డును సవరించింది. సాధారణంగా లాస్ ఏంజెలిస్ నుంచి లండన్ వెళ్లేందుకు 10 గంటలకు పైనే సమయం పడుతుంది. అయితే ఈ విమానం 9 గంటల్లోనే గమ్యాన్ని చేరుకుంది.