imran khan: పుల్వామా దాడి.. ఇమ్రాన్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆసిఫ్ అలీ జర్దారీ

  • ఇమ్రాన్ ఖాన్ పరిపక్వత లేని నాయకుడు
  • అంతర్జాతీయ రాజకీయాలపై అవగాహన లేదు
  • ఇతరులు చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారు

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిపక్వత లేని నాయకుడు ఇమ్రాన్ అని అన్నారు. అంతర్జాతీయ రాజకీయాలపై ఇమ్రాన్ కు ఎలాంటి అవగాహన లేదని చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, భారత్ కు కౌంటర్ ఇవ్వడంలో ఇమ్రాన్ విఫలమయ్యారని జర్దారీ అన్నారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ జర్దారీ ఈ మేరకు విమర్శలు గుప్పించారు.

తన హయాంలో ముంబై దాడులు చోటు చేసుకున్నాయని... అప్పుడు కూడా పాకిస్థాన్ ను భారత్ తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసిందని జర్దారీ చెప్పారు. అయితే, ఆ సమస్యను తాము సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, సమస్యను దౌత్యపరంగా ఎదుర్కొనేలా భారత్ పై ఒత్తిడి తీసుకురాగలిగామని తెలిపారు.
 
అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ను భారత్ ఒంటరిని చేయాలని ప్రయత్నిస్తోందనే ప్రశ్నకు సమాధానంగా... చాలా కాలం నుంచే ఇస్లామాబాద్ ప్రపంచ వ్యతిరేకతను ఎదుర్కొంటోందని... ప్రస్తుత నాయకత్వంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని జర్దారీ చెప్పారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బ్యాక్ సీట్ డ్రైవర్ లాంటి వారని ఎద్దేవా చేశారు. ఇతరులు చెప్పినట్టుగా ఇమ్రాన్ వ్యవహరిస్తున్నారని...  ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైందని విమర్శించారు.

పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో భర్త అయిన జర్దారీ 2008 నుంచి 2013 వరకు ఆ దేశ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన హయాంలో పాకిస్థాన్ కు చెందిన లష్కరే తాయిబాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించారు. ఆ దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News