Andhra Pradesh: ఎడాపెడా అప్పులు చేసిన మహిళ.. స్తంభానికి కట్టేసి కొట్టిన గ్రామస్తులు, భర్త!
- ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఘటన
- పలువురి వద్ద రూ.2.5 లక్షల అప్పు చేసిన యల్లమ్మ
- 10 రోజుల తర్వాత కనిపించడంతో గ్రామస్తుల ఆగ్రహం
ఎడాపెడా అప్పులు చేసేసి ఇవ్వకుండా తిరుగుతున్న ఓ మహిళను సొంత భర్తతో పాటు గ్రామస్తులు చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది. ఆదోనిలోని రాజీవ్ గాంధీ నగర్ కు చెందిన యల్లమ్మ, జమ్మన్న దంపతులు. యల్లమ్మ గ్రామానికి చెందిన పలువురి వద్ద రూ.2.5 లక్షల అప్పు చేసింది. ఇంట్లోని 600 గ్రాముల వెండి, 2.5 తులాల బంగారాన్ని కూడా ఎవరికీ చెప్పకుండా ఎత్తుకెళ్లింది.
దాదాపు 10 రోజుల తర్వాత యల్లమ్మ కాలనీలో కనిపించడంతో గ్రామస్తులు, భర్త ఆమెను ఓ స్తంభానికి కట్టేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆమెపై చేయిచేసుకున్నారు. విషయం తెలుసుకుని మీడియా అక్కడకు వెళ్లడంతో యల్లమ్మను తాము కొట్టలేదని గ్రామస్తులు బుకాయించారు. కుల పెద్దలతో పంచాయితీ నిర్వహించి సమస్యను పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు.
కాగా, ఈ విషయమై యల్లమ్మ మాట్లాడుతూ.. ఓ వ్యక్తికి అవసరమని కోరితే తాను అప్పు చేసి మరీ డబ్బులు ఇచ్చాననీ, అయితే సదరు వ్యక్తి తన నుంచి డబ్బు తీసుకోలేదని ఇప్పుడు బుకాయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోరినా పోలీసులు స్పందించలేదని వాపోయింది.