flipkart: ఫ్లిప్ కార్ట్ లో ఇంటి దొంగలు.. గుట్టుచప్పుడు కాకుండా 150 ఖరీదైన స్మార్ట్ ఫోన్ల చోరీ!
- అలీపూర్ హబ్ నుంచి తరలిస్తుండగా ఘటన
- డ్రైవర్లే దొంగతనానికి పాల్పడినట్లు అధికారుల నిర్ధారణ
- అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ లో భారీ దొంగతనం చోటుచేసుకుంది. ఢిల్లీ శివార్లలోని అలీపూర్ హబ్ లో 150 ఖరీదైన స్మార్ట్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. దీంతో ఫ్లిప్ కార్ట్ కంపెనీ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన అధికారులు ఈ నెల 19న అలీపూర్ హబ్ నుంచి బిలాస్ పూర్ లోని గోదాముకు తరలించేటప్పుడు ఈ దొంగతనం జరిగిందని నిర్ధారించారు.
ఆరోజు విధులు నిర్వర్తించిన వారిని విచారించి ఓ ముఠాకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముఠా నాయకుడు సంతోష్‌తో పాటు బ్రిజ్‌మోహన్, అఖిలేశ్, రంజిత్‌లు పలు ట్రాన్స్ పోర్ట్ కంపెనీల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 30 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఈ ఘటనపై కేసు నమోదుచేసి నిందితులను అరెస్ట్ చేశామన్నారు. గతంలో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ చోరీ కేసులో సంతోష్, బ్రిజ్ మోహన్‌లపై అక్కడి ఫర్సత్ గంజ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయిందని పేర్కొన్నారు.