Chandrababu: 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై తొలిసారి స్పందించిన చంద్రబాబు... టెలీ కాన్ఫరెన్స్ లో ప్రస్తావన!
- ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరిస్తున్నారు
- కుట్రదారులతో చేతులు కలిపిన దర్శకులు
- తిరస్కరించాలని ప్రజలకు చంద్రబాబు వినతి
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై ఈ ఉదయం టీడీపీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన వేళ, చంద్రబాబునాయుడు స్పందించారు. ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేందుకు కొందరు కుట్రలు పన్నారని విమర్శించారు. కుట్రదారులతో చేతులు కలిపిన దర్శకులను తిరస్కరించాలని అన్నారు.
ఎన్టీఆర్ జీవితం ఎందరికో స్ఫూర్తని, అందుకే 'మహానాయకుడు', 'కథానాయకుడు' చిత్రాలు ఆ స్ఫూర్తిని చాటి చెప్పేలా వస్తున్నాయని అన్నారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని చంద్రబాబు ప్రస్తావించడం ఇదే మొదటిసారి. వాస్తవాలను వక్రీకరించి సినిమాలు తీస్తే, ప్రజలు వాటిని చూడబోరని అన్నారు. వారికి గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే రానుందని హెచ్చరించారు. కాగా, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మార్చి తొలి వారంలో విడుదల కానుండగా, ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' రేపు రిలీజ్ అవుతోంది.