Andhra Pradesh: ఏపీలో అమల్లోకి వచ్చిన కాపు రిజర్వేషన్.. గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం
- ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన కేంద్రం
- దానిని ఈబీసీలు, కాపులకు సమానంగా పంచిన ఏపీ ప్రభుత్వం
- ఈ నెల నుంచే అమల్లోకి
ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తూ చట్టం తీసుకొచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ పదిశాతం రిజర్వేషన్‌ను ఏపీ ప్రభుత్వం కాపులు, ఇతర కులాలకు సమానంగా పంచింది. ఇందులో భాగంగా కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కేటాయిస్తూ చట్టం తీసుకొచ్చింది.
ఈ కొత్త చట్టం వల్ల కాపులకు విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఈబీసీలకు మిగతా ఐదు శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. కాగా, కాపులకు ఐదు శాతం, ఈబీసీలకు ఐదు శాతం రిజర్వేషన్‌ను అమల్లోకి తెచ్చినట్టు పేర్కొంటూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.