Telangana: ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి కోసం 13.36 లక్షల మంది రైతుల సమాచారం పంపిన తెలంగాణ సర్కారు
- మొత్తం 25 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించిన ప్రభుత్వం
- తొలి విడతలో 13.36 లక్షల మంది వివరాలను పంపిన సర్కారు
- 79,417 మంది లబ్ధిదారులతో సిద్ధిపేట అగ్రస్థానం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం 13.36 లక్షల మంది రైతుల వివరాలను కేంద్రానికి పంపించింది. మొత్తం 25 లక్షల కుటుంబాలు ఈ పథానికి అర్హులు కాగా తొలి విడతలో భాగంగా ఇప్పటి వరకు 13.36 లక్షల మంది డేటాను కేంద్ర ప్రభుత్వ సర్వర్‌లో అప్‌డేట్ చేసినట్టు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి తెలిపారు. మిగతా లబ్ధిదారుల పేర్లను మార్చి 1 నాటికి అప్‌డేట్ చేయనున్నట్టు తెలిపారు.
ఇక, తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే సిద్ధిపేటలో అత్యధికంగా 79,417 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో నల్గొండ (77,345), నాగర్‌కర్నూలు (74,606), మేడ్చల్-మల్కాజిగిరి(5,414), మహబూబాబాద్ (14,707), భద్రాద్రి-కొత్తగూడెం (21,083) మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో జనరల్ కేటగిరీలో 9.4 లక్షల మంది, ఎస్సీ లబ్ధిదారులు 2.4 లక్షల మంది, ఎస్టీ లబ్ధిదారులు 1.4 లక్షల మంది ఉన్నారు.