NTR: ‘నమ్మకద్రోహి’ ఎవరన్నది ప్రజలు నిర్ణయించాలి!: నాదెండ్ల భాస్కరరావు
- ఎన్టీఆర్ ని నేను వెన్నుపోటు పొడవలేదు
- నన్ను ఎన్టీఆరే వెన్నుపోటు పొడిచాడు
- ఈ విషయం ప్రజలే చెబుతారు
ఎన్టీఆర్’ బయోపిక్ లోని రెండో భాగం ‘మహానాయకుడు’లో మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు పాత్ర ఎలా ఉంటుందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ నెల 22న విడుదల కానున్న ‘మహానాయకుడు’లో నాదెండ్ల పాత్రను రాజకీయ నమ్మక ద్రోహిగా చిత్రీకరిస్తే ఏం చేస్తారన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ‘నమ్మకద్రోహి’ ఎవరన్నది ప్రజలు నిర్ణయం చేయాలని, ఆ రోజున ఏం జరిగిందన్న విషయం కొత్త జనరేషన్ కు కూడా తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఎన్టీఆర్ ని తాను వెన్నుపోటు పొడవలేదని, తనను ఎన్టీఆరే వెన్నుపోటు పొడిచాడని, ఈ విషయమై ప్రజలను అడిగితే వారే చెబుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన విషయంలో చంద్రబాబుది ఎటువంటి పాత్ర లేదని, ఆయనదేమీ తప్పులేదని, అందులో కేవలం తన పాత్రే ఉందని, పడిపోయిన పార్టీని బాబు నిలబెట్టాడని ఆ కుటుంబం ఉద్దేశమని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం తంటాలు పడుతున్న క్రమంలోనే ‘ఎన్టీఆర్’ బయోపిక్ తీశారని వ్యాఖ్యానించారు.