Andhra Pradesh: ‘సినిమా’ అంటే నేను తెలుసుకున్నది అదే!: మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు
- ఉన్నది లేనట్టు, లేంది ఉన్నట్టు చూపించడమే ‘సినిమా’
- గంటో, రెండు గంటలో ప్రేక్షకులను మభ్యపెడతారు
- ఈ చిత్రంలో నా పాత్రపై చిత్రయూనిట్ నన్ను కలవలేదు
‘సినిమా’ అంటే తాను తెలుసుకున్నది.. ఉన్నది లేనట్టు, లేంది ఉన్నట్టు చూపించడమేనని మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు వ్యాఖ్యానించారు. ఈ నెల 22న ‘ఎన్టీఆర్’ బయోపిక్ లోని రెండో భాగం ‘మహానాయకుడు’ విడుదల కానుంది. ‘మహానాయకుడు’ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి చూపించనున్నారు.
ఈ నేపథ్యంలో 'మహానాయకుడు’లో నాదెండ్ల భాస్కరరావు పాత్రను నెగెటివ్ రోల్ గా చూపించనున్నారన్న విషయమై ఆయన్ని ప్రశ్నించగా పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. గంటో, రెండు గంటలో ప్రేక్షకులను మభ్యపెట్టి పైసలు జేబులో వేసుకోపోయేదే ‘సినిమా’ అని అభిప్రాయపడ్డారు. కనుక, దీని గురించి అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.
ఈ చిత్రంలో తన పాత్రను నెగెటివ్ గా చూపించారన్న వార్తల నేపథ్యంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ తన కుమారుడు ఇప్పటికే కోర్టు నోటీసులు జారీ వేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయమై సెన్సార్ బోర్డుకు నోటీసులు ఇచ్చామని ఈ కేసు చూస్తున్న తమ న్యాయవాదులు మొన్ననే తనతో చెప్పారని అన్నారు.
ఈ చిత్రంలో నటించిన ఓ అమ్మాయి ఎవరో సెన్సార్ బోర్డు సభ్యురాలని, అందుకని, ఆమె చెప్పినట్టుగా సెన్సార్ బోర్డు అధికారులు నడుచుకున్నారని ఆరోపించారు. అందుకే, ఈ చిత్రంలో తన పాత్రపై ఉన్న అభ్యంతరం గురించి చిత్రయూనిట్ తమను సంప్రదించలేదన్న విషయాన్ని తన న్యాయవాదులు తనకు చెప్పారని నాదెండ్ల వివరించారు.