Congress: ఆరోగ్యం బాగాలేదు, నన్ను వెళ్లనివ్వండి: ఈడీ అధికారులను అభ్యర్థించిన రాబర్ట్ వాద్రా

  • మూడు గంటల విచారణకే అనారోగ్యం!
  • మరోసారి విచారణకు రావాలని కోరిన ఈడీ
  • ఇప్పటికే పలు దఫాలు హాజరైన వాద్రా

మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా బుధవారం కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై కొంతకాలం క్రితం మనీ లాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. లండన్ లో అక్రమాస్తులు కొనుగోలు చేశారంటూ ఈడీ ఆయనపై ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఒక్క ఫిబ్రవరి నెలలోనే వాద్రా నాలుగు సార్లు ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనకు మార్చి 2 వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఢిల్లీ న్యాయస్థానం ఫిబ్రవరి 16న తీర్పు ఇచ్చింది.

అయితే బుధవారం నాడు విచారణకు వచ్చిన సమయంలోనే రాబర్ట్ వాద్రా అస్వస్థతతో ఉన్నట్టు సమాచారం. ఈడీ అధికారులకు కూడా ఆ విషయాన్నే తెలియజేశారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం కల్పించాలంటూ అధికారులను అభ్యర్థించారు. దాంతో ఈడీ అధికారులు కేవలం మూడు గంటలు మాత్రమే విచారించి ఆపై రాబర్ట్ వాద్రా వెళ్లిపోయేందుకు అనుమతించారు. విచారణ కొనసాగుతున్న సమయంలో ఢిల్లీలోని జామ్ నగర్ ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమికూడి ప్రధాని నరేంద్ర మోదీకి, ఈడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News