Pakistan: పుల్వామా ఉగ్రదాడిని ధైర్యంగా ఖండించిన పాక్ మహిళా జర్నలిస్టు... ఆమె దారిలో మరికొందరు మహిళలు
- పాకిస్తాన్ లో ఊపందుకుంటున్న 'సోషల్' ఉద్యమం
- యాంటీ హేట్ చాలెంజ్ పేరుతో విస్తృత ప్రచారం
- మహిళల్లో వెల్లివిరుస్తున్న చైతన్యం
పుల్వామా దాడిని ఖండించడానికి పాకిస్థాన్ ప్రధానమంత్రికే ధైర్యం చాలని ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి మహిళలు చెరగని స్థయిర్యంతో ముందుకొచ్చి భారత సీఆర్పీఎఫ్ అమరవీరుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. నేనో పాకిస్థాన్ అమ్మాయిని, పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తున్నాను.. అంటూ ప్లకార్డులు పట్టుకుని పాక్ మహిళలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. సెహీర్ మీర్జా అనే మహిళా పాత్రికేయురాలు యాంటీ హేట్ చాలెంజ్ పేరుతో హ్యాష్ టాగ్ కు రూపకల్పన చేసి తొలిగా పుల్వామా దాడిని ఖండించింది. ఆమె బాటలోనే ఇప్పుడు పాక్ లో చాలామంది మహిళలు ఎలాంటి జంకుగొంకు లేకుండా పుల్వామా దాడిని తప్పుబడుతున్నారు.
సెహీర్ మీర్జా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పుల్వామా దారుణంపై ఘాటుగా స్పందించింది. "దేశభక్తి పేరుతో మానవత్వాన్ని అమ్ముకోలేను" అంటూ ఎల్లలు లేని మానవీయతను ప్రదర్శించింది. తాను ధైర్యంగా స్పందించడమే కాదు మరికొందరు మహిళలు కూడా భారత్ లో చోటుచేసుకున్న అమానవీయ ఘటనపై తమ అభిప్రాయాలు తెలిపేలా ప్రోత్సహించింది. దాంతో యాంటీహేట్ చాలెంజ్ హ్యాష్ ట్యాగ్ తో పాటు 'వీ స్టాండ్ విత్ ఇండియా', నో టు వార్ హ్యాష్ ట్యాగ్ లతో పాకిస్థాన్ మహిళలు పుల్వామా ఘటనను ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు.